Petrol, Diesel Purchases: పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై ఎలాంటి ఆంక్షలు లేవు: కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత వస్తుందన్న ప్రచారం జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ కొనుగోళ్లపై ఎలాంటి పరిమితులు లేదా ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో వాహనదారులకు రూ.100,రూ.500 వరకు మాత్రమే ఇంధనం ఇస్తున్నారన్న వార్తలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో చాలామంది అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేస్తూ భయాందోళనలకు గురవుతున్నారు. ఈ పరిస్థితులపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ స్పందించారు. దేశంలో పెట్రోల్,డీజిల్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.
వివరాలు
ప్రజలపై భారం తగ్గించే దిశగా కేంద్రం చర్యలు
పెరుగుతున్న ఇంధన ధరలు, పశ్చిమాసియా ఘర్షణల ప్రభావంతో సరఫరా వ్యవస్థలో కొంత అంతరాయం ఏర్పడినా.. దేశ అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఇంధన పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, సహజవాయువు సరఫరాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని వివరించారు. ప్రజలపై భారం తగ్గించే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోందన్నారు.
వివరాలు
1.34 కోట్ల వంటగ్యాస్ సిలిండర్లు పంపిణీ
పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని వంటగ్యాస్ ఉత్పత్తిని కూడా పెంచినట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 1.34 కోట్ల వంటగ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అలాగే వాణిజ్య వంటగ్యాస్ అమ్మకాలు 23,588 టన్నులకు చేరుకున్నాయని చెప్పారు. ఇంధన పంపిణీపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, అక్రమాలను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా సుమారు 500 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇంధన సరఫరాలు పూర్తిగా స్థిరంగా ఉన్నాయని,పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై ఎలాంటి ఆంక్షలు లేవని ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా స్పష్టం చేసింది.