Telangana: తెలంగాణలో రైతుల కోసం కొత్త డిస్కం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రైతుల కోసం ప్రత్యేకంగా విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది. 'తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ' (ఆర్పీడీసీఎల్) స్థాపనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రం తరఫున వ్యవసాయం,తాగునీరు, సాగునీటి పథకాల కనెక్షన్ల కోసం ప్రత్యేక డిస్కం ఏర్పాటు ప్రతిపాదనను పంపగా, ఈ నెల 18న కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర అనుమతి తర్వాత చట్టపరమైన ప్రక్రియలను వేగవంతం చేస్తూ, డిస్కం లైసెన్స్ కోసం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి గురువారం దరఖాస్తు సమర్పించారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఇప్పటికే పనిచేస్తున్న రెండు డిస్కంల నుంచి 51 మంది ఉద్యోగులను డిప్యుటేషన్‌పై కొత్త సంస్థకు బదిలీ చేశారు.
వివరాలు
డిస్కం ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు
డిస్కం ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సంస్థకు సీఎండీగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముషారఫ్‌ను నియమించగా, ఇతర డిస్కంల నుంచి నలుగురిని డైరెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది. రైతులకు ప్రత్యేకంగా, నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యమని సీఎండీ ముషారఫ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ కొత్త డిస్కం అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 మొదటి రోజు నుంచే తెలంగాణలో మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు పనిచేయనున్నాయి.