FTSCs: పోక్సో, అత్యాచార కేసుల విచారణకు మరో 850 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
ఈ వార్తాకథనం ఏంటి
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల (FTSC) సంఖ్యను పెంచడంతో పాటు, ఈ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2031 మార్చి వరకు ఈ పథకం కొనసాగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. మహిళలు, పిల్లలపై నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.
వివరాలు
850కి పెరగనున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
నేరాల నియంత్రణకు ఇప్పటికే ఉన్న చట్టాలను సమర్థంగా అమలు చేయడంతో పాటు, అవసరమైన కొత్త చట్టాల రూపకల్పనలోనూ ఈ నిర్ణయం కీలకమని వివరించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 779 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు పనిచేస్తున్నాయి.
తాజాగా తీసుకున్న నిర్ణయంతో వీటి సంఖ్య 850కి చేరనుంది. ఈ పథకాన్ని మరో ఐదేళ్లపాటు కొనసాగించేందుకు మొత్తం రూ.3,788.04 కోట్లను కేటాయించారు.
ఇందులో నిర్భయ నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం రూ.2,353.15 కోట్లను ఖర్చు చేయనుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి రూ.1,434.89 కోట్లను సమకూర్చనున్నాయి.
ప్రతి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఒక ప్రత్యేక న్యాయమూర్తి, ఒక ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో పాటు ఆరుగురు సహాయక సిబ్బందిని నియమించనున్నారు.
వివరాలు
4 లక్షలకు పైగా కేసుల పరిష్కారం
ఈ కోర్టుల పనితీరును మెరుగుపరచడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఈ పథకం అమలును పర్యవేక్షిస్తుంది. కేసులు అధికంగా పెండింగ్‌లో ఉన్న జిల్లాలను గుర్తించి,అక్కడ కొత్త కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019 అక్టోబరు 2న ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల కేంద్ర పథకాన్ని ప్రారంభించారు.
ప్రస్తుతం దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలవుతోంది.
ఈ కోర్టులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు లైంగిక దాడులు,పోక్సో చట్టం(POCSO Act)కింద నమోదైన 4.02 లక్షలకు పైగా కేసులను పరిష్కరించాయి.
కేసుల విచారణలో జాప్యాన్ని తగ్గించి, బాధితులకు త్వరగా న్యాయం అందించడంలో ఈ కోర్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
వివరాలు
బాధితులకు అనుకూలమైన వాతావరణం
కేసుల విచారణను వేగవంతం చేయడంతో పాటు బాధితులు ఎలాంటి భయం లేకుండా సాక్ష్యం చెప్పేందుకు ఈ కోర్టుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
బాధితుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వల్నరబుల్ విట్నెస్ డిపోజిషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.
చిన్నారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా వారు ధైర్యంగా, ఆత్మగౌరవంతో తమ వాంగ్మూలాలను నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
మహిళలు, పిల్లలు సాక్ష్యం చెప్పే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించేందుకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడనున్నాయి.
ఆన్‌లైన్ డాష్‌బోర్డులు, సమీక్షా సమావేశాలు, హైకోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతర సంప్రదింపుల ద్వారా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పనితీరును కేంద్ర న్యాయ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.