Lok Sabha Seats: దేశంలో అసెంబ్లీ స్థానాలు 50% పెంపు.. తెలుగు రాష్ట్రాలలో పెరగనున్న సీట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ప్రజాప్రాతినిధ్యాన్ని విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను సగటున 50 శాతం పెంచే ప్రణాళికపై అడుగులు వేస్తోంది. ఈ అంశంపై బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే లోక్‌సభ స్థానాలు ప్రస్తుతం ఉన్న 543 నుంచి 816కి పెరగనున్నాయి. రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 4,123 నుంచి 6,185కి చేరనున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరగగా, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 263కి పెరుగుతాయి. అదే విధంగా లోక్‌సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరగనున్నాయి.
వివరాలు
విపక్షాలతో చర్చలు, కీలక బిల్లులకు సిద్ధం
ఈ అంశంపై సోమవారం సాయంత్రం ఎన్డీయే సమావేశంలో భాగస్వామ్య పార్టీలకు కేంద్రం వివరాలు వెల్లడించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్‌ల నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. కాంగ్రెసేతర విపక్ష పార్టీలతో కూడా కేంద్రం విడిగా చర్చలు జరిపింది. కాంగ్రెస్ పార్టీతో కూడా అమిత్ షా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల సంఖ్య పెంపు దిశగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాల్లో సవరణలు చేయడానికి ఈ సమావేశాల్లోనే బిల్లులు తీసుకురానున్నట్లు సమాచారం.
వివరాలు
ప్రాథమిక జనాభా లెక్కలతోనే ప్రక్రియ వేగవంతం
లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కేంద్రం డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, వేగంగా సీట్ల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసి 2029 సాధారణ ఎన్నికల్లో అమలు చేసే లక్ష్యంతో ఉంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 2023 సెప్టెంబర్‌లో ఆమోదించిన చట్టం ప్రకారం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 2034 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. రాజ్యాంగంలోని అధికరణలు 170(3), 81(3) ప్రకారం 2026 తర్వాత వెలువడే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల అమలు 2034 నుంచే ప్రారంభమవుతుందని ఇంతవరకు భావించారు.
వివరాలు
ఉత్తర-దక్షిణ తేడాల ఆందోళనల మధ్య సమతుల్యత ప్రయత్నం
అయితే జనగణనప్రక్రియను 2027 మార్చి 1 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది. ప్రాథమికజనాభా గణాంకాలను ప్రకటించిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే అవకాశముంది. ఈఅంశంపై అన్నిపార్టీల మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. జనగణన తర్వాత వచ్చిన గణాంకాల ఆధారంగా సీట్ల పెంపు జరిగితే ఉత్తర,దక్షిణ రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యంలో అసమానతలు రావచ్చని దక్షిణాది రాష్ట్రాల పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సగటున 50శాతం సీట్ల పెంపు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈవిధానం అమలు అయితే ప్రస్తుత రాజకీయప్రాతినిధ్యం దాదాపు యథాతథంగా కొనసాగుతుందని భావిస్తున్నారు. కేంద్రం ప్రతిపాదనపై స్పందించేందుకు రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో మంగళవారం విపక్ష నాయకులు సమావేశం కానున్నారు.