Loading...
AP Data on Loans: స్టాండప్‌, ముద్ర రుణాల్లో ఎస్సీలకు భారీ ఊరట.. ఏపీపై కేంద్రం కీలక వివరాలు
స్టాండప్‌, ముద్ర రుణాల్లో ఎస్సీలకు భారీ ఊరట.. ఏపీపై కేంద్రం కీలక వివరాలు

AP Data on Loans: స్టాండప్‌, ముద్ర రుణాల్లో ఎస్సీలకు భారీ ఊరట.. ఏపీపై కేంద్రం కీలక వివరాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టాండప్‌ ఇండియా, ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాల కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ లబ్ధిదారులకు అందుతున్న బ్యాంకు రుణాలు గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంట్‌లో అమలాపురం ఎంపీ జీఎంహెచ్‌ బాలయోగి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌధరి ఈ వివరాలను వెల్లడించారు. స్టాండప్‌ ఇండియా పథకం కింద 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో కలిపి 8,548 మంది ఎస్సీ లబ్ధిదారులకు రూ.2,006 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. 2021-22 నుంచి 2023-24 వరకు మూడు సంవత్సరాల్లో కేవలం 2,244 మందికి రూ.551.12 కోట్ల రుణాలు మాత్రమే అందగా, తాజా రెండేళ్లలో రుణాల విలువ 263 శాతం పెరిగినట్లు కేంద్రం తెలిపింది.

వివరాలు 

రుణాల పంపిణీలో పురోగతి

ప్రధానమంత్రి ముద్ర యోజన కింద కూడా రుణాల పంపిణీలో పురోగతి నమోదైంది.

2024-25, 2025-26లో కలిపి 2,18,045 మంది ఎస్సీ ఖాతాదారులకు రూ.2,341.49 కోట్ల రుణాలు మంజూరయ్యాయి.

అంతకుముందు మూడేళ్లలో 2,60,560 మందికి రూ.2,600 కోట్ల రుణాలు మాత్రమే లభించాయి.

సగటున చూస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రతి ఏడాది 1,09,022 మందికి రూ.1,170 కోట్ల రుణాలు అందగా, గత ప్రభుత్వ హయాంలో ఏటా సగటున 86,853 మందికి రూ.866 కోట్ల మేర మాత్రమే రుణాలు అందినట్లు వివరించారు.

వివరాలు 

ఏపీలో నిరుద్యోగ రేటు 4.2 శాతం

ఆంధ్రప్రదేశ్‌లో 2025 నాటికి 15 సంవత్సరాలు దాటిన వారిలో నిరుద్యోగ రేటు 4.2 శాతంగా నమోదైనట్లు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి శోభా కరంద్లాజే తెలిపారు.

లోక్‌సభలో వైకాపా సభ్యుడు పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు.

రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 2021-22లో 4.2 శాతం ఉండగా, 2023-24లో అది 4.1 శాతానికి తగ్గినట్లు కూడా పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఐటీఐల సంఖ్య పెరిగినా ప్రవేశాలు తగ్గుముఖం

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీఐల సంఖ్య పెరిగినప్పటికీ వాటిలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గిందని కేంద్ర మంత్రి జయంత్‌ చౌధరి తెలిపారు.

2014లో రాష్ట్రంలో 467 ఐటీఐలు ఉండగా 56,429 మంది విద్యార్థులు చేరారు. అయితే 2026 నాటికి ఐటీఐల సంఖ్య 520కు పెరిగినా, ప్రవేశాలు 54,213కు తగ్గినట్లు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

కృష్ణా-గోదావరి జల వివాదాల పరిష్కారానికి కమిటీ

కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య కొనసాగుతున్న వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల సంఘం ఛైర్మన్‌ నేతృత్వంలో 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి రాజ్‌భూషణ్‌ చౌధరి తెలిపారు.

రాజ్యసభలో భాజపా ఎంపీ కె. లక్ష్మణ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాచారం వెల్లడించారు.

వివరాలు 

ఏపీకి భారీగా పెరిగిన పర్యాటకులు

2025లో ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించిన దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కేంద్ర పర్యాటకశాఖ వెల్లడించింది.

2024తో పోలిస్తే దేశీయ పర్యాటకుల సంఖ్య 28.73 కోట్ల నుంచి 35.38 కోట్లకు పెరిగి 23.16 శాతం వృద్ధి నమోదైంది.

విదేశీ పర్యాటకుల సంఖ్య 1.76 లక్షల నుంచి 2.14 లక్షలకు చేరి 21.29 శాతం పెరిగింది.

రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఈ వివరాలు వెల్లడించారు.

వివరాలు 

అప్రెంటీస్‌షిప్‌ పథకానికి అధిక నిధులు

నేషనల్‌ అప్రెంటీస్‌షిప్‌ ప్రోగ్రాం కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.22 కోట్ల నిధులు విడుదలయ్యాయి.

2024-25లో విడుదలైన సుమారు రూ.19.69 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 12 శాతం అధికమని కేంద్ర మంత్రి జయంత్‌ చౌధరి తెలిపారు.

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో 88.81 లక్షల మంది నమోదు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో 88,81,080 మంది అసంఘటిత రంగ కార్మికులు నమోదు చేసుకున్నట్లు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి శోభా కరంద్లాజే వెల్లడించారు.

వివరాలు 

రాష్ట్ర జీఎస్‌టీ ఆదాయం 3 శాతం పెరుగుదల

2025-26లో ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌టీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 3 శాతం పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఎస్‌జీఎస్‌టీ,ఐజీఎస్‌టీ సెటిల్‌మెంట్‌ అనంతరం రాష్ట్రానికి 2024-25లో రూ.33,301 కోట్ల ఆదాయం రాగా, 2025-26లో అది రూ.34,301 కోట్లకు పెరిగింది.

అదే సమయంలో జీఎస్‌డీపీలో జీఎస్‌టీ వాటా 2.10 శాతం నుంచి 1.90 శాతానికి తగ్గింది.

రాష్ట్ర జీఎస్‌డీపీ 2024-25లో రూ.15.91లక్షల కోట్లు ఉండగా,2025-26 నాటికి రూ.17.62లక్షల కోట్లకు పెరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌధరి తెలిపారు.

వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ వివరాలు వెల్లడించారు.

అలాగే,2025-26 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 2,01,125 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

వివరాలు 

చోరీకి గురైన 615 పురాతన వస్తువులు తిరిగి స్వదేశానికి

వివిధ దేశాలకు అక్రమంగా తరలించబడిన 615 పురాతన వస్తువులను భారత్‌కు తిరిగి తీసుకొచ్చినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ శెఖావత్‌ పార్లమెంట్‌లో తెలిపారు.

గత ఐదేళ్లలో చోరీకి గురైన పురాతన వస్తువులపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు.

తిరిగి స్వదేశానికి వచ్చిన వాటిలో తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని గోలింగేశ్వరస్వామి ఆలయం నుంచి దొంగిలించబడిన నంది విగ్రహం, కర్ణాటకలోని మండ్యా జిల్లా నుంచి అపహరణకు గురైన గణపతి విగ్రహం కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT