CBSE: సీబీఎస్ఈ డిజిటల్ మూల్యాంకనంపై కేంద్రం సీరియస్.. పూర్తి నివేదిక కోరిన విద్యాశాఖ
ఈ వార్తాకథనం ఏంటి
సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల సమాధాన పత్రాల డిజిటల్ మూల్యాంకనానికి సంబంధించిన వివాదంపై కేంద్ర విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది. ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానం అమలులో చోటుచేసుకున్న సమస్యలు,హైదరాబాద్‌కు చెందిన కోయెంప్ట్ ఎడ్యుటెక్ సంస్థకు కాంట్రాక్టు కేటాయించిన తీరు తదితర అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని సీబీఎస్ఈను ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఏవైనా అక్రమాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల నిర్వహించిన 12వ తరగతి బోర్డు పరీక్షల డిజిటల్ మూల్యాంకన ప్రక్రియలో పలు సాంకేతిక సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
వివరాలు
ఇబ్బందులు ఎదుర్కొన్న వేలాది మంది విద్యార్థులు
స్కాన్ చేసిన సమాధాన పత్రాలు స్పష్టంగా కనిపించకపోవడం,కొన్ని పేజీలు అందుబాటులో లేకపోవడం,ఒక విద్యార్థి సమాధాన పత్రాల స్థానంలో మరొకరి పత్రాలు కనిపించడం వంటి లోపాలు బయటపడ్డాయి. దీంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టెండర్ల ప్రక్రియ ఎలా నిర్వహించారు, కాంట్రాక్టు కేటాయింపుకు సంబంధించిన నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారు, ఇందులో భాగమైన అధికారులు ఎవరు, కేంద్ర మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేశారా అనే అంశాలపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ కోరింది.
వివరాలు
టెండర్ నిబంధనలు మార్చారంటూ ఆరోపణలు
2026 విద్యా సంవత్సరానికి తొలిసారిగా సీబీఎస్ఈ పెద్ద ఎత్తున ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని అమలు చేసింది. ఇందుకోసం 2025 డిసెంబర్‌లో కోయెంప్ట్ ఎడ్యుటెక్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించింది. అయితే ఫలితాల విడుదల అనంతరం మూల్యాంకనానికి సంబంధించిన ఫిర్యాదులు పెరగడంతో కొన్ని కేసుల్లో మాన్యువల్ రీ-వాల్యుయేషన్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. టీసీఎస్ వంటి అనుభవజ్ఞ సంస్థలను పక్కనపెట్టి, కోయెంప్ట్ ఎడ్యుటెక్‌కు అనుకూలంగా టెండర్ నిబంధనల్లో మార్పులు చేశారని ఆయన ఆరోపించారు.
వివరాలు
ఆరోపణలను ఖండించిన బీఎస్ఈ
అయితే ఈ ఆరోపణలను సీబీఎస్ఈ ఖండిస్తోంది. అన్ని నిబంధనలను పాటించామని, సాంకేతిక అర్హత సాధించిన సంస్థల్లో తక్కువ ధరను కోట్ చేసినందువల్లే కోయెంప్ట్ ఎడ్యుటెక్‌కు కాంట్రాక్టు కేటాయించినట్లు బోర్డు వివరణ ఇచ్చింది. కాగా కేంద్ర విద్యాశాఖ జోక్యంతో ఈ వ్యవహారంపై విచారణ మరింత వేగం పుంజుకుంది.