Chandrababu : చంద్రబాబుకు కంటి ఆపరేషన్ పూర్తి.. ఇంటికి బయల్దేరిన తెలుగుదేశం అధినేత
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కంటి ఆపరేషన్ పూర్తి అయ్యింది. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగింది. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు చంద్రబాబుకు క్యాటరాక్ట్ ఆపరేషన్ ను విజయంవంతంగా పూర్తి చేశారు. దాదాపు 2 గంటల సేపు కొనసాగిన ఈ శస్త్ర చికిత్స ముగిసిన వెంటనే జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి బయల్దేరారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన పూర్తిగా విశ్రాంతిలో ఉండనున్నారు. మరోవైపు చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ ఆభిమానులు ఆస్పత్రికి తరలివచ్చారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కంటికి శస్త్ర చికిత్స పూర్తి చేసుకున్న చంద్రబాబు
ఈ ఏడాది జూన్‌లో చంద్రబాబు ఎడమ కంటికి సర్జరీ చేయించుకున్నారు. ఈ మేరకు ఇవాళ కుడి కంటికి శస్త్ర చికిత్స జరిగింది. సోమవారం ఏఐజీకి వచ్చిన చంద్రబాబుకు, వైద్యులు చర్మ సంబంధిత పరీక్షలు నిర్వహించారు. తొలుత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన చంద్రబాబుకు, వైద్య పరీక్షలు అవసరమని వైద్యులు సూచించారు. దీంతో హైదరాబాద్‌కు వచ్చారు. అనంతరం ఏఐజీకి వచ్చిన చంద్రబాబుకు, వైద్యులు రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. సోమవారం మరోసారి ఏఐజీకి వెళ్లడంతో చర్మ సంబంధిత పరీక్షలు నిర్వహించారు. అదే రోజు ఎల్వీ ప్రసాద్‌కు వెళ్లగా బాబుకు వైద్యులు కంటికి సంబంధించిన పరీక్షలు చేసి మంగళవారం కంటికి శస్త్ర చికిత్స చేస్తామన్న వైద్యులు ఇవాళ పూర్తి చేశారు.