LOADING...
APCRDA: అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయం ప్రారంభం
అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయం ప్రారంభం

APCRDA: అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయం ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2025
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకున్న నేపధ్యంలో, తొలి ప్రభుత్వ భవనంగా రూపుదిద్దుకున్న సీఆర్డీఏ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ప్రత్యేకంగా, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులతో కలిసి ఈ కార్యాచరణను ప్రారంభించడం ఈ కార్యక్రమానికి విశేషతను చేకూర్చింది. ఈ కార్యక్రమం ఈ రోజు ఉదయం 9.54 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా జరిగింది. కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతులతో కలిసి రిబ్బన్ కట్ చేసి, నూతన భవనాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.

వివరాలు 

పరిపాలనలో సమన్వయం

ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి భవనాన్ని కలియతిరిగి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భవన నిర్మాణ శైలి, సౌకర్యాలను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాంగణంలో G+7 అంతస్తుల ప్రధాన భవనంతో పాటు, మరో నాలుగు ప్రీ-ఇంజినీర్డ్ భవనాలు (పీఈబీ) కూడా నిర్మించబడ్డాయి. భవనం పూర్తి అయిన తర్వాత, సీఆర్డీయే, ఏడీసీఎల్ (అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) కార్యాలయాలు, పురపాలక శాఖకు చెందిన అన్ని విభాగాల కార్యకలాపాలు ఇక్కడి నుంచే కొనసాగనున్నాయి. దీని ద్వారా పరిపాలనలో సమన్వయం పెరిగి పనులు మరింత వేగవంతం కానున్నాయని ప్రభుత్వం భావిస్తున్నది.

వివరాలు 

కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి పెమ్మసాని, పలువురు ప్రజాప్రతినిధులు 

ప్రారంభోత్సవానికి ముందు, సీఎం చంద్రబాబు భూములు ఇచ్చిన రైతులతో కొంత సమయం ముచ్చటించారు. రాజధాని నిర్మాణంలో రైతులు చేసిన త్యాగాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయం ప్రారంభం