Amaravati: అమరావతి ట్రాన్స్‌పోర్ట్‌పై చంద్రబాబు కీలక నిర్ణయం.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక
ఈ వార్తాకథనం ఏంటి
రాజధాని అమరావతి పరిధిలో ప్రజా రవాణా కోసం మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. విజయవాడ, గుంటూరు సహా సమీప ప్రాంతాలను రాజధానితో అనుసంధానిస్తూ.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ 66వ అథారిటీ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాజధానిలోని శాసనసభ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పైర్ (టవర్)ను లిఫ్ట్‌లతో సహా రూ.661 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ భవనంలో వ్యూపాయింట్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
వివరాలు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా స్పైర్
''అసెంబ్లీ భవనంలో ప్రజలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా స్పైర్‌ను నిర్మించాలి.
అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, సచివాలయ టవర్లతో పాటు క్వాంటమ్ టవర్స్, బిట్స్ వంటి భవనాలు కూడా ప్రత్యేకమైన కట్టడాలుగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు.
అమరావతి నగరంలో 50 శాతం సస్టెయినబుల్ గ్రీన్ కవర్ ఉండేలా చర్యలు చేపట్టాలని, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
వివిధ పుష్ప జాతులకు చెందిన మొక్కలను నాటాలని సూచించారు. కొండలు, నీటి వనరులను కూడా అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేలా బ్లూప్రింట్ సిద్ధం చేయాలని చెప్పారు.
వివరాలు
అమరావతి పేరు దేశవిదేశాల్లో మారుమోగాలి
అమరావతి పేరు దేశవిదేశాల్లో మారుమోగేలా విస్తృతంగా ప్రచారం చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
ఇటీవల లద్దాఖ్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన ఓ బైకర్‌ను అక్కడి బాలుడు ''అమరావతి నుంచి వచ్చారా?'' అని అడిగిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు.
అమరావతి పేరు ప్రజల మనసుల్లోకి ఎంతగా చొచ్చుకుపోయిందో చెప్పేందుకు అంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ మరొకటి ఉండదని అన్నారు.
దేశ, విదేశాల్లో అమరావతి ఘనతను చాటేలా ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు.
''విద్యుత్ స్తంభాలు లేని నగరంగా.. బ్లూ, గ్రీన్, డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ వంటి ఐదు ప్రత్యేకతల థీమ్‌తో అమరావతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
ప్రతి పౌరుడూ ఇది నా నగరం అని భావించేలా చేయాలి'' అని చంద్రబాబు పేర్కొన్నారు.
వివరాలు
రూ.1,548 కోట్లతో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు
అమరావతిని సెల్ఫ్‌ఫైనాన్స్‌డ్ నగరంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ఆదాయ నమూనాలపైనా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఇందుకోసం ఒక కమిటీని నియమించి అధ్యయనం చేయాలని ఆదేశించారు.
సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
రాజధానిలోని 29 గ్రామాలతో పాటు ప్రధాన రహదారులు గ్రామాల మీదుగా వెళ్లడం వల్ల ఇళ్లు కోల్పోయిన వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు రూ.1,548 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇచ్చారు.
రాజధాని గ్రామాల్లో సగటున ఒక్కొక్కరికి రోజుకు 135 లీటర్ల నీరు అందించేలా పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తారు.
వివరాలు
నలందా సంస్థకు కృష్ణాయపాలెంలో ఐదు ఎకరాల స్థలం
వర్షపు నీరు, మురుగునీటి పారుదల వ్యవస్థలను రాజధానిలో నిర్మిస్తున్న ప్రధాన పైప్‌లైన్లతో అనుసంధానం చేయనున్నారు.
రాజధానిలో ఇప్పటివరకు ఇంటర్నేషనల్ స్కూళ్లకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. ఇకపై రాష్ట్రంలో మంచి ప్రమాణాలు పాటిస్తున్న విద్యా సంస్థలకు కూడా రాజధానిలో పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు స్థలాలు కేటాయించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా నలందా సంస్థకు కృష్ణాయపాలెంలో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కార్యాలయ భవనం నిర్మాణానికి 2019కి ముందు నేలపాడులో అర ఎకరం స్థలాన్ని కేటాయించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేలపాడుకు బదులుగా నిడమర్రులో స్థలం ఇచ్చారు.
అయితే గతంలో తమకు కేటాయించిన నేలపాడు స్థలమే కావాలని సంస్థ కోరడంతో.. ఆ అభ్యర్థనకు అథారిటీ ఆమోదం తెలిపింది.
వివరాలు
భూసమీకరణ 80శాతం పూర్తవుతుంది
రెండో విడత భూసమీకరణలో భాగంగా ఎకరం కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న భూములను సమీకరణకు ఇచ్చే రైతులకు కూడా ఒక ఎకరానికి చెల్లించే వార్షిక కౌలు మొత్తాన్ని చెల్లించేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది.
అంటే పది సెంట్లు లేదా 20 సెంట్లు మాత్రమే ఉన్న భూమిని భూసమీకరణలో ఇచ్చినా.. వారికి ఒక ఎకరానికి ఇచ్చే కౌలు మొత్తాన్ని చెల్లించనున్నారు.
రెండో విడత భూసమీకరణ ప్రక్రియ అక్టోబరు నెలాఖరుకు 80 శాతం పూర్తవుతుందని తెలిపారు. రైతులపై ఎక్కడా ఒత్తిడి చేయడం లేదని చెప్పారు.
15 శాతం భూమికి సంబంధించి రెవెన్యూ సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎస్ చెప్పినట్లు నారాయణ వెల్లడించారు.
వివరాలు
విమానాశ్రయానికి భూసమీకరణపై క్యాబినెట్‌లో నిర్ణయం
రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసమీకరణ అంశంపై తదుపరి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి పి.నారాయణ తెలిపారు.
విమానాశ్రయ నిర్మాణానికి 5 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని చెప్పారు.
అయితే 5 వేల ఎకరాలు కావాలంటే మొత్తం 20 వేల ఎకరాల భూమిని సమీకరించాల్సి ఉంటుందని వివరించారు.
ప్రధాన మౌలిక వసతుల కల్పనకు అవసరమైన భూమితో పాటు రైతులకు తిరిగి ఇవ్వాల్సిన స్థలాలను కలిపి చూస్తే మొత్తం 20 వేల ఎకరాలు అవసరమవుతాయని నారాయణ వెల్లడించారు.