#NewsBytesExplainer: విపత్తు ఎదుర్కోవడంలో అప్రమత్తత నుంచి ఆచరణ వరకూ.. చంద్రబాబుకే సాధ్యం !
ఈ వార్తాకథనం ఏంటి
ఒక విపత్తు తప్పదని స్పష్టమైందంటే, చేయాల్సిన మొదటి పని నష్టాన్ని వీలైనంత తగ్గించడం. ఆ విపత్తు ముగిసిన వెంటనే సాధారణ పరిస్థితులు త్వరగా పునరుద్ధరించడమే లక్ష్యం కావాలి. దీనికోసం ఏ చర్యలు తీసుకోవాలి, వాటిని ఎలా సమర్థంగా అమలు చేయాలి.. అనేది అసలైన క్రైసిస్ మేనేజ్‌మెంట్. మొంథా తుపాన్ ఏపీ తీరాన్ని తాకడం ఖాయమని తేలిన మరుక్షణం నుంచి చంద్రబాబు నాయుడు ఇదే పని చేస్తున్నారు. దుబాయ్ నుంచి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నిద్రపోవడం లేదు..అధికారుల్ని నిద్రపోనివ్వడం లేదు.
వివరాలు
అనుభవమే ఆయుధం - ప్రజలకు భరోసా
ఏ సంక్షోభాన్నైనా ఎదుర్కోవాలంటే ముందుగా దానిపై స్పష్టమైన దృష్టి ఉండాలి. తొలిసారి ఎదుర్కొంటున్న వారివద్ద తప్పులు జరగవచ్చు, కానీ చంద్రబాబుకు అలాంటి పరిస్థితులు కొత్తవికావు. ఉమ్మడి రాష్ట్ర కాలంలో ఎన్నో ప్రకృతి విపత్తులను ఆయన ఒంటరిగా ఎదుర్కొన్నారు. తుపానుల స్వభావం, వాటి ప్రభావం, సంభవించే సమస్యలన్నీ ఆయనకు బాగా తెలుసు. ఆ అనుభవాన్ని ఇప్పుడు సంపూర్ణంగా వినియోగిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని పూర్తిగా పనిలోకి దింపి, ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేయించారు. తుపాను వచ్చాక ప్రజలు సాయం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా అన్నీ ముందస్తుగా సిద్ధం చేశారు. ముఖ్యంగా, ప్రజల్లో మానసిక ధైర్యాన్ని పెంచేలా చర్యలు తీసుకున్నారు.
వివరాలు
మానసికంగా సిద్ధం చేయడం.. తుపానును ఎదుర్కొనే మొదటి దశ
ఏ విపత్తు రానుందో తెలుసుకున్న క్షణం నుంచే, ప్రజలను భయపెట్టకుండా అప్రమత్తం చేయడం చాలా ముఖ్యమైంది. ప్రమాదం వస్తుందనే కారణంతో వారిని భయాందోళనకు గురిచేయకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించడం ఒక కళ. ఈ విషయంలో చంద్రబాబు పరిపాలన ప్రత్యేకంగా నిలుస్తుంది. అల్పపీడనం తుపానుగా మారి కాకినాడ ప్రాంతంలో తీరం దాటుతుందని తెలిసిన వెంటనే, ఆయన అనుభవంతో ముందే వ్యూహం సిద్ధం చేశారు. అధికారులను, సిబ్బందిని యుద్ధ స్థాయిలో పని చేసేలా దిశానిర్దేశం ఇచ్చి తానే ముందు వరుసలో నిలబడ్డారు.
వివరాలు
చివరి వ్యక్తికి సహాయం చేరే వరకు నిద్రపోరు..నిద్ర పోనివ్వరు !
హుదూద్ తుపాను సమయంలో చంద్రబాబు చూసిన ఎవరికైనా.. ఆయనలాంటి పరిపాలనా అందరికీ సాధ్యం కాదని ఎవరైనా చెబుతారు. ఆ సమయంలో నాశనం అయిపోయిన కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించడంలో టెలికాం కంపెనీలు ఆలస్యం చేస్తుంటే.. చంద్రబాబు ఇచ్చిన ఒక్క హెచ్చరికతోనే యాజమాన్యాలు తక్షణమే కదిలాయి. కేవలం ఒక్క రోజులో సెల్ సిగ్నల్స్ వచ్చేలా చేశారు. ఆ తర్వాత పునర్నిర్మాణ పనులు అతి వేగంగా జరిగాయి. విశాఖ ప్రజలకు చంద్రబాబు క్రైసిస్ మేనేజ్‌మెంట్ అంటే ఏమిటో బాగా తెలుసు. ఇప్పుడు అదే క్రమంలో కాకినాడ తుపానును ఎదుర్కొనడానికీ ఆయన బృందంతో ముందున్నారు. ఆయనకు విశ్రాంతి లేదు, అలాగే సాయం అందే వరకూ ఇతరులకు కూడా విశ్రాంతి ఇవ్వరు.