Talliki Vandanam Scheme : తల్లికి వందనం నిధులపై చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్.. ఆ నెలలోనే డబ్బుల జమ!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. నెల్లూరు జిల్లా వింజమూరులో నిర్వహించిన 'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలపై కీలక ప్రకటన చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులను వచ్చే జూన్ నెలలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానుండగా, జూన్ 12 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి. ఇదే తేదీన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 'తల్లికి వందనం' నిధులు జమ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సీఎం చేసిన తాజా ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
తల్లుల ఖాతాలో జమ
ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఇందులో స్కూల్ లేదా కాలేజీ నిర్వహణ ఖర్చుల కోసం రూ.2,000 మినహాయించి, మిగిలిన రూ.13,000ను విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఒకవేళ తల్లి లేని సందర్భాల్లో తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. గతేడాది కూడా ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67,01,653 మంది విద్యార్థులకు సుమారు రూ.8,454 కోట్ల సాయం అందించారు.
వివరాలు
విద్యార్థికి కనీసం 75% హాజరు ఉండాలి
వైసీపీ ప్రభుత్వ కాలంలో 52% మంది విద్యార్థులకు ఈ పథకం వర్తించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 84.27% మందికి విస్తరించిందని గతంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ పథకానికి అర్హత పొందాలంటే విద్యార్థికి కనీసం 75% హాజరు ఉండాలి. విద్యార్థి తల్లి పేరుతో బ్యాంక్ ఖాతా ఉండడం తప్పనిసరి. ఆ ఖాతా ఆధార్‌తో NPCI లింక్ అయి ఉండాలి. బ్యాంక్ బ్రాంచ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అకౌంట్ ఆధార్‌తో లింక్ అయిందో లేదో NPCI అధికారిక వెబ్‌సైట్ ద్వారా పరిశీలించుకోవచ్చు.