Velugonda Project : కరవు నేలకు కృష్ణమ్మ పరుగులు.. ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టు అంకితం
ఈ వార్తాకథనం ఏంటి
కరవు నేలకు కృష్ణమ్మ పరుగులు తీయబోతోంది. వర్షం పడితేనే నీళ్లు.. లేదంటే బీళ్లుగా మారే పరిస్థితికి ఇక తెరపడనుంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం కానుంది. ప్రాజెక్టు పూర్తవుతుందా? అన్న సందేహాలకు తెరదించుతూ కరవు ప్రాంతాలకు కొండంత భరోసాగా ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. లక్షలాది మందికి తాగునీరు, లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్న వెలిగొండ ప్రాజెక్టులో కీలక పనులు పూర్తయ్యాయి. ఆగస్టు 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. తొలిదశ ప్రయోజనాలను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కీలకమైన జంట సొరంగాల నిర్మాణం పూర్తికావడంతో పాటు వాటి నుంచి నీటిని నల్లమలసాగర్‌కు తరలించే 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువ పనులు కూడా పూర్తయ్యాయి.
వివరాలు
1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు
తొలిదశలో నల్లమలసాగర్‌లో 10.70 టీఎంసీల నీటిని నింపనున్నారు.
దీనివల్ల 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది.
విశేషమేమిటంటే.. 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది చంద్రబాబే. ఇప్పుడు అదే ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేయనుండటం మరో విశేషం.
ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరవు ప్రాంతాల్లో నీటి కోసం ప్రజలు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం.
సాగునీటికి స్థిరమైన భరోసా లేకపోవడంతో పంట వేసినా దిగుబడి వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఉండేది.
ఉపాధి అవకాశాలు లేక ప్రజలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం సాధారణమైంది.
సమీపంలోని చిన్న పట్టణాల్లోనూ తాగునీటిని డబ్బాల్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది.
వివరాలు
పాల ఖర్చుకు సమానం
కొన్ని కుటుంబాలు పాలకు ఎంత ఖర్చు చేస్తారో దాదాపు అంతే మొత్తాన్ని తాగునీటి కోసం వెచ్చించాల్సి వచ్చేది.
గ్రామాలు, పట్టణాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు పంచాయతీలు, మున్సిపాలిటీలు కోట్లాది రూపాయలు ఖర్చు చేసేవి.
నీటి కొరత కారణంగా వ్యవసాయం, ఆర్థిక పరిస్థితులు, సామాజిక జీవనం కూడా వెనుకబడిన ప్రాంతాలకు వెలిగొండ ప్రాజెక్టు కొత్త ఆశను తీసుకురానుంది.
వివరాలు
జంట సొరంగాలు పూర్తి.. నల్లమలసాగర్ సిద్ధం
వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన జంట సొరంగాలను 18.8 కిలోమీటర్ల పొడవున తవ్వారు.
సొరంగాల్లో బెంచింగ్,లైనింగ్ వంటి పనులను కూడా పూర్తిచేశారు.
వీటి ద్వారా వచ్చే నీటిని నల్లమలసాగర్ జలాశయానికి తరలించేందుకు 21.8కిలోమీటర్ల పొడవైన ఫీడర్ కాలువ పనులను పూర్తిచేశారు.
గతంలోనే తవ్విన ఈ ఫీడర్ కాలువ కాలక్రమంలో పూడిపోవడంతో పాటు గత ప్రభుత్వాల సమయంలో చేపట్టిన నాసిరకం పనుల కారణంగా పలు సమస్యలు ఎదురయ్యాయి.
ఎన్డీయే ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టి రిటైనింగ్ వాల్ నిర్మాణం, కాలువ లైనింగ్ పునరుద్ధరణ పనులను చేపట్టి పూర్తిచేసింది.
నల్లమలసాగర్ జలాశయంలో ఉన్న మూడు గ్యాప్‌లను పూడ్చేందుకు కాంక్రీట్ డ్యాంలను నిర్మించారు.
జలాశయం నుంచి మూడు కాలువలకు నీటిని మళ్లించేందుకు అవసరమైన పనులు కూడా పూర్తయ్యాయి.
వివరాలు
జంట సొరంగాలు పూర్తి.. నల్లమలసాగర్ సిద్ధం
నల్లమలసాగర్ నిర్మాణం కారణంగా ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లో 85 శాతం నిర్వాసిత కుటుంబాలకు రెండు నెలల్లోనే రూ.768 కోట్ల పరిహారం చెల్లించారు.
మరో రూ.150 కోట్లు చెల్లించి వారికి పునరావాసం కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. మిగిలిన సమస్యలను పరిష్కరించడంపైనా జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది.
వివరాలు
పనుల తీరు ఇలా..
వెలిగొండ ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం రూ.10,200 కోట్లు. ఇప్పటివరకు రూ.7,983 కోట్లను ఖర్చు చేశారు.
2014-19, 2024-26 మధ్య తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉన్న కాలంలోనే ప్రాజెక్టులో సగం పనులు పూర్తయ్యాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
2019-24 మధ్య వైకాపా ప్రభుత్వం రూ.981 కోట్ల విలువైన పనులు చేపట్టింది.
ఇందులో రూ.140 కోట్ల పనుల బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని చెల్లించింది.
అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో మిగిలిన పనులు చేపట్టారు.
వివరాలు
పూర్తికాకుండానే జాతికి అంకితం చేసిన జగన్
వెలిగొండ ప్రాజెక్టులో సొరంగాల నిర్మాణం పూర్తికాకముందే, నల్లమలసాగర్ పరిధిలోని పునరావాస గ్రామాల ప్రజలను ఖాళీ చేయించకుండానే, నీటిని విడుదల చేసేందుకు అవసరమైన పనులు పూర్తికాకముందే 2024 ఎన్నికలకు నెల రోజుల ముందు అప్పటి ముఖ్యమంత్రి జగన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడంపై విమర్శలు వచ్చాయి.
వైకాపా ప్రభుత్వ హయాంలో రెండో సొరంగంలో ఇరుక్కుపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్‌ను బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైన పనులు చేపట్టలేదని ఎన్డీయే ప్రభుత్వం ఆరోపిస్తోంది.
రెండో సొరంగంలో నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు నిర్వహించడంతో పాటు మనుషులతో పనులు చేయించినట్లు చెబుతోంది.
మట్టి, వ్యర్థాలను బయటకు తరలించేందుకు మొదటి సొరంగంలో ఏడు చోట్ల రంధ్రాలు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది
వివరాలు
ఏమిటీ వెలిగొండ?
మొదటి సొరంగానికి ఈ రంధ్రాలు చేయకపోయి ఉంటే వెలిగొండ నీటిని 2024 జూన్ తర్వాత మాత్రమే విడుదల చేయగలిగేవారమని ఎన్డీయే ప్రభుత్వం చెబుతోంది.
శ్రీశైలం జలాశయం ఫోర్‌షోర్ ప్రాంతంలోని కొల్లంవాగు ఎగువ ప్రాంతంలో ఉన్న నల్లమల కొండలను సొరంగాలుగా తొలిచి.. అక్కడి నీరు గురుత్వాకర్షణ శక్తితో నల్లమలసాగర్ జలాశయానికి చేరే విధంగా వెలిగొండ ప్రాజెక్టును రూపొందించారు.
కృష్ణా నదికి వచ్చే వరద జలాలను జంట సొరంగాల ద్వారా మళ్లించి, ఫీడర్ కాలువతో నల్లమలసాగర్ జలాశయానికి తరలించేలా ప్రాజెక్టును నిర్మించారు.
ఈ జలాశయం మొత్తం 53.85 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యంతో రూపొందింది.
వివరాలు
ఏమిటీ వెలిగొండ?
నల్లమలసాగర్ నుంచి తీగలేరు కాలువ,గొట్టిపడియ కాలువ,తూర్పు ప్రధాన కాలువల ద్వారా నీటిని గురుత్వాకర్షణ ఆధారంగా దిగువ ప్రాంతాలకు తరలిస్తారు.
మొత్తంగా 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టును రూపొందించారు.
ప్రకాశం, మార్కాపురం,నెల్లూరు, కడప జిల్లాల్లోని 30మండలాల ప్రజల జీవన పరిస్థితులను వెలిగొండ ప్రాజెక్టు మార్చే అవకాశం ఉంది.
ఇందులో ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 3,36,100 ఎకరాలకు, నెల్లూరు జిల్లాలో 84 వేల ఎకరాలకు, కడప జిల్లాలో 27,200 ఎకరాలకు నీరు అందనుంది.
రెండు దశలు పూర్తిగా అందుబాటులోకి వస్తే ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లోని 24 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం.
దీంతో దశాబ్దాలుగా నీటి కోసం ఎదురుచూస్తున్న కరవు ప్రాంతాల్లో వ్యవసాయం, తాగునీరు, ఉపాధి అవకాశాలకు కొత్త ఊతం లభించనుంది.