Potti Sriramulu Statue: నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ.. సీఎం చేతుల మీదుగా ఆవిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళిగా 58 అడుగుల ఎత్తైన భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఈరోజు ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడిగా పొట్టి శ్రీరాములు చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
వివరాలు
ఆర్టీజీఎస్‌లో సమీక్ష సమావేశం
పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తుళ్లూరు సమీపంలో 6.8 ఎకరాల్లో నిర్మిస్తున్న స్మృతివనంలో ఆయన 125వజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అమరావతిలో ఏర్పాటైన తొలి భారీ విగ్రహం ఇదే కావడం విశేషం. ఈ విగ్రహ నిర్మాణానికి 26టన్నుల కాంస్యం,42టన్నుల ఇనుము వినియోగించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.45 గంటలకు సీఎం చంద్రబాబు అమరావతిలోని సచివాలయానికి చేరుకోనున్నారు. అక్కడ యుద్ధ ప్రభావం,గ్యాస్ సరఫరా పరిస్థితులపై ఆర్టీజీఎస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశముందని సమాచారం. అనంతరం సాయంత్రం విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో కూడా సీఎం పాల్గొననున్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈ విందును ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,ముస్లిం మత పెద్దలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.