AP Roads: ఏపీలో రోడ్ల నిర్వహణలో మార్పులు.. జాతీయ రహదారుల మాదిరిగా రాష్ట్ర రహదారులు
జాతీయ రహదారుల మాదిరిగా రవాణా సౌలభ్యం పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్వహణ విధానంలో కీలక మార్పుల కోసం ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. పీపీపీ (ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్షిప్) విధానాన్ని ప్రవేశపెట్టి రోడ్ల నిర్వహణ బాధ్యతను గుత్తేదారులకు అప్పగించడానికి ప్రణాళికలను రచిస్తోంది. ప్రస్తుతం వర్షాల కారణంగా రోడ్లపై ఏర్పడే గుంతల పూడ్చడం, రోడ్లకు రెన్యువల్ చేయడం వంటి పనుల కోసం ప్రభుత్వ అనుమతులు, నిధుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా, పీపీపీ విధానంలో గుత్తేదారులనే బాధ్యత వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. పిచ్చిమొక్కల తొలగింపు నుంచి బీటీ లేయర్ వేయడంలో దాకా గుత్తేదారులే చూసుకుంటారు.
మొదటి విడతలో 1,307 కి.మీ
రాష్ట్ర హైవేల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న మొదటి విడతలో 18 రోడ్లను (1,307 కి.మీ.), రెండో విడతలో 68 రోడ్లను (3,931 కి.మీ.) ఎంపిక చేశారు. ఈ రోడ్ల నిర్వహణలో పీపీపీ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం అధ్యయనం చేసింది. ఈ ప్రణాళికకు సంబంధించి సలహా సంస్థలను నియమించి, పరిశీలన చేపట్టారు. ఈ అధ్యయనంలో రోడ్లపై ప్రస్తుత వాహన రద్దీ, భవిష్యత్తులో వాహనాల పెరుగుదల, టోల్ ద్వారా వసూలు చేసే ఆదాయం, గుత్తేదారులకు చెల్లించాల్సిన వయబిలిటీ గ్యాప్ ఫండ్స్ వంటి అంశాలు పరిశీలనలో ఉంటాయి. ఈ అధ్యయనం తర్వాత నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లనుంది. ఈ కొత్త విధానం రవాణా రంగంలో మార్పు తీసుకువస్తుందా లేదో వేచి చూడాలి.