AP High Court: కానుకల లెక్కింపులో మార్పులు అనివార్యం.. టీటీడీకి హైకోర్టు స్పష్టం
ఈ వార్తాకథనం ఏంటి
వెంకటేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు వాటి ఆర్థిక విలువకన్నా భక్తిభావానికి ప్రతీకలని, వెల కట్టలేని మతపరమైన విశ్వాసం, మనోభావాలకు చిహ్నాలని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి కానుకలను అత్యంత జాగ్రత్తగా భద్రపరచడం, భక్తిభావంతో గౌరవించడం, పూర్తిస్థాయిలో పారదర్శకంగా లెక్కించే విధానాన్ని అమలు చేయడం తితిదే పాలకమండలి ప్రధాన బాధ్యత అని పేర్కొంది. భక్తుల విశ్వాసాలు, మనోభావాలను కాపాడాల్సిన కర్తవ్యాన్ని తితిదే నిర్వర్తించాల్సిందేనని తేల్చిచెప్పింది. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల లెక్కింపు ప్రక్రియలో తక్షణమే సంస్కరణలు అవసరమని హైకోర్టు ఆదేశించింది. హుండీల నుంచి కానుకలు బయటకు తీసిన తర్వాత సీలింగ్, రవాణా, పరకామణిలో సీల్ తొలగింపు, లెక్కింపు వరకు ప్రతి దశలోనూ సాంకేతికతను పెంచాలని, క్రమంగా మానవ జోక్యాన్ని తగ్గించాలని సూచించింది.
Details
తనిఖీలు చేపట్టాలి
అలా చేస్తే కానుకలు లెక్కించేందుకు వచ్చే భక్తులను దుస్తులు తీసి తనిఖీలు చేయాల్సిన అవసరం ఉండదని, వారికి అవమానకర పరిస్థితులు రాకుండా ఉంటాయని పేర్కొంది. కృత్రిమ మేధ (ఏఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తిస్థాయిలో యాంత్రీకరణ, కంప్యూటరైజేషన్, రికార్డుల డిజిటలైజేషన్ చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. పరకామణిలో కానుకల చోరీ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మూడు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
Details
రెండు దశల్లో సంస్కరణలు చేపట్టాలి
తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు. మొదటిగా, పరకామణిలో తక్షణం మరియు శాశ్వతంగా అమలు చేసేలా రెండు దశల్లో సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. తక్షణ సంస్కరణలు (ప్లాన్-ఏ)లో భాగంగా హుండీ సీలింగ్, రవాణా, డీసీలింగ్, లెక్కింపు విధానాల్లో మార్పులు చేయాలని, ఈ భద్రతా చర్యలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని సూచించారు. రెండవదిగా, శాశ్వత సంస్కరణలు (ప్లాన్-బీ)లో భాగంగా కానుకల వర్గీకరణ, విదేశీ కరెన్సీ గుర్తింపు, వివిధ లోహాలను వేరుచేసే విధానాల కోసం ఏఐ, సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Details
సాంకేతిక నిపుణులను నియమించుకోవాలి
తితిదేకు సహకరించేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో అనుభవం ఉన్న భక్తుల నుంచి సాంకేతిక నిపుణులను నియమించుకోవాలని సూచించారు. శాశ్వత సంస్కరణలపై ఎనిమిది వారాల్లో ముసాయిదా రూపొందించి కోర్టుకు సమర్పించాలని పేర్కొన్నారు. మూడవదిగా, కానుకల చోరీకి పాల్పడిన రవికుమార్ మరియు అతని కుటుంబ సభ్యులు తమ ఆస్తులను ఎవరెవరికి రిజిస్ట్రేషన్ చేశారన్న పూర్తి వివరాలతో వారంలోపు సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని ఏసీబీ డీజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.