Delhi airport: సాంకేతిక సమస్యతో దిల్లీ ఎయిర్‌పోర్టులో .. 100కు పైగా విమానాలు ఆలస్యం
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని న్యూదిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)విభాగంలో లోపం ఏర్పడడంతో విమానాల రాకపోకల్లో అంతరాయం జరిగింది. దీంతో దాదాపు 100కి పైగా విమానాలు ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్టులోని ఆటో ట్రాక్ సిస్టమ్‌కు అవసరమైన సమాచారం పంపే ఆటోమెటిక్ మెసేజ్ స్విచ్ వ్యవస్థలో లోపం ఏర్పడినట్టు తెలుస్తోంది. దీనివల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు విమాన ప్రణాళికలు ఆటోమేటిక్‌గా అందకుండా పోయాయి. అందుచేత ATC సిబ్బంది స్వయంగా(మ్యానువల్‌గా)విమానాల షెడ్యూల్‌ను సిద్దం చేసి పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రక్రియ సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకోవడంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు వివరించారు.
వివరాలు
దిల్లీ ఎయిర్‌పోర్టులో రోజుకు సుమారు 1500కి పైగా విమానాల రాకపోకలు
ఇప్పటివరకు 100కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ లో మార్పులు రావడంతో ఇండిగో,స్పైస్ జెట్,ఎయిర్ ఇండియా వంటి ఎయిర్‌లైన్లు తమ ప్రయాణికులకు విడివిడిగా సూచనలు జారీ చేసి అసౌకర్యానికి క్షమాపణలు కోరాయి. ఇదిలా ఉండగా,ప్రయాణికులు ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.చెక్‌ఇన్,ఇతర కౌంటర్ల వద్ద భారీ రద్దీ కనిపిస్తోంది. సాంకేతిక సిబ్బంది సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని,పూర్తి స్థాయిలో పనులు సవ్యంగా నడవడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ లోపం కారణంగా లఖ్‌నవూ,జైపూర్, చండీగఢ్, అమృత్‌సర్ వంటి విమానాశ్రయాల్లోనూ ప్రభావం చూపే అవకాశముందని తెలుస్తోంది. దేశంలో అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయంగా పేరుగాంచిన దిల్లీ ఎయిర్‌పోర్టులో రోజుకు సుమారు 1500కి పైగా విమానాలు రాకపోకలు సాగిస్తాయి.