AP Rice Export: చైనాకు 2,700 టన్నుల ఏపీ బియ్యం ఎగుమతి.. చెన్నై పోర్టు కొత్త రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత రైతులు పండించిన బియ్యం ఎగుమతిలో చెన్నై పోర్టు అరుదైన రికార్డును నమోదు చేసింది. ఒకే రోజు,ఒకే ఆర్డర్ కింద 2,700 టన్నుల బియ్యాన్ని విదేశాలకు పంపినట్లు కాంకర్ ఇన్‌లాండ్ కంటెయినర్ డిపో (ఐసీడీ) అధికారులు శనివారం 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో ఇంత భారీ స్థాయిలో బియ్యం ఎగుమతి జరగడం ఇదే తొలిసారి అని తండియార్‌పేట ఐసీడీ అధికారులు తెలిపారు. ఈ ఎగుమతి కోసం సామర్లకోట, తణుకు కేంద్రాల నుంచి 42 రైల్వే వ్యాగన్లలో బియ్యాన్ని లోడ్ చేసి,573 కిలోమీటర్ల దూరంలో ఉన్న తండియార్‌పేట డిపోకు తరలించారు. అక్కడ బియ్యాన్ని కంటెయినర్లలోకి మార్చి,చెన్నై పోర్టు నుంచి ప్రత్యేక నౌక ద్వారా చైనాకు పంపించారు.
వివరాలు
ఖర్చు ఆదా కోసమే చెన్నైకి..
బియ్యం లోడింగ్, అన్‌లోడింగ్ నుంచి నౌకలో ఎక్కించే ప్రక్రియ వరకు మొత్తం వ్యవహారాన్ని ఒకే రోజులో పూర్తి చేయడం విశేషంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. భారత్ నుంచి చైనాకు బియ్యం ఎగుమతులపై ఆహార భద్రత కారణాలతో 2022-23లో ఆంక్షలు అమలులోకి వచ్చాయి. అయితే దేశంలో వరి సాగు పెరగడం, బియ్యం నిల్వలు అధికంగా ఉండటంతో 2025 నుంచి కేంద్ర ప్రభుత్వం ఎగుమతి నిబంధనలను క్రమంగా సడలించింది. దీంతో చైనా వ్యాపారులు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బియ్యం ఎగుమతి ఏజెంట్ల మధ్య ఒప్పందాలు కుదిరాయని కాంకర్ అధికారులు వెల్లడించారు.
వివరాలు
ఖర్చు ఆదా కోసమే చెన్నైకి..
బియ్యాన్ని రోడ్డుమార్గంలో కాకుండా రైల్వే వ్యాగన్ల ద్వారా తరలించడం వల్ల రవాణా వ్యయంలో సుమారు 40 శాతం వరకు ఆదా సాధ్యమైందని తెలిపారు. మరోవైపు విశాఖపట్టణం పోర్టులో ఎగుమతి ఖర్చులు ఎక్కువగా ఉండటం,అవసరమైన స్థాయిలో కంటెయినర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఎగుమతిదారులు చెన్నై పోర్టును ఎంపిక చేసుకుంటున్నట్లు వివరించారు.