Telangana: చేవెళ్ల బస్సు ప్రమాదం..20మంది మృతి.. కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద శనివారం జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ దారుణం మీర్జాగూడ సమీపంలో చోటుచేసుకుంది. తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు 70 మంది ప్రయాణికులతో వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కంకరలోడుతో లారీ ఢీకొట్టింది. లారీ వేగంగా వచ్చి బస్సుపై ఒరిగిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులపై భారీగా కంకర పడింది. క్షణాల్లోనే బస్సు మొత్తం కంకరతో నిండిపోయింది. దీంతో లోపల ఉన్నవారు కూరుకుపోయారు.
వివరాలు
ఘటనా స్థలంలో చేవెళ్ల పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
ప్రమాదం అనంతరం మూడు జేసీబీల సాయంతో రక్షణచర్యలు కొనసాగుతున్నాయి.కంకర కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడం కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. బస్సు ధ్వంసమైపోయిన దృశ్యం చూస్తే గుండె పిండేసేలా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పటాన్‌చెరు లక్డారం క్రషర్ నుంచి వికారాబాద్ వైపు వెళ్తున్న లారీ, రహదారిలోని గుంతను తప్పించబోయి మీర్జాగూడ వద్ద బస్సును ఢీకొట్టిందని ప్రాథమిక సమాచారం. ఢీకొన్న వేళ లారీపై ఉన్న కంకర మొత్తం బస్సుపై పడటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. అత్యవసర సమాచారంతో చేవెళ్ల పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి గంభీరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
వివరాలు
కంట్రోల్‌రూమ్ నంబర్లు
ఈ ఘటన కారణంగా హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా దుఃఖభారిత వాతావరణంలోకి మారిపోయింది. ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం సమాచారం తీసుకుంటున్నారని సర్కారు వర్గాలు వెల్లడించాయి. ఘటనపై అన్ని శాఖలను సీఎం అప్రమత్తం చేయడంతో, సీఎస్ పర్యవేక్షణలో వెంటనే సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఎండీ, రవాణా కమిషనర్, ఫైర్ డీజీ లు స్వయంగా రక్షణచర్యలు పర్యవేక్షించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. సహాయక చర్యల సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు కూడా విడుదల చేశారు. సచివాలయంలో కంట్రోల్‌రూమ్ నంబర్లు 9912919545, 9440854433 ఏర్పాటు చేశారు.