Bird flu: బర్డ్ ఫ్లూ కలకలం.. చిత్తూరు జిల్లాలో 28 వేల కోళ్లు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. చిత్తూరు జిల్లా పరిధిలోని సదుం మండలంలోని కొన్ని గ్రామాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత వారం రోజులుగా అక్కడి కోళ్ల ఫారాల్లో కోళ్లు ఒక్కసారిగా చనిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వైరస్ ప్రభావంతో సుమారు 28 వేల కోళ్లు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ఇతర ప్రాంతాలకు పాకకుండా చర్యలు చేపట్టిన రెవెన్యూ అధికారులు మూడు కోళ్ల ఫారాలను తక్షణమే సీజ్ చేశారు.
వివరాలు
శాస్త్రీయ విధానంలో కోళ్లను పూడ్చిపెడుతున్నారు
అలాగే మిగిలి ఉన్న కోళ్లను కూడా నిర్మూలించే ప్రక్రియను ప్రారంభించారు. గ్రామాల బయట జేసీబీలతో భారీ గుంతలు తవ్వి, శాస్త్రీయ విధానంలో కోళ్లను పూడ్చిపెడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన స్థానిక ఎమ్మార్వో, వ్యాధి సోకిన ఫారాలను వెంటనే మూసివేశామని తెలిపారు. ప్రజలు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించినట్లు చెప్పారు. ప్రజారోగ్య భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అలాగే కోళ్ల వ్యర్థాలను ఎక్కడైనా పడేయకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచించారు.