Karanataka : కర్ణాటక సీఎంల చరిత్ర.. పూర్తి కాలం పూర్తి చేసిన నేతలు ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై గత కొన్ని నెలలుగా వినిపించిన ప్రచారం చివరకు నిజమైంది. 2023లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన సిద్ధరామయ్య ఇప్పుడు ఆ పదవిని వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల తర్వాత పార్టీ నాయకత్వం ఇచ్చిన హామీ మేరకు డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఆయనకు కూడా పూర్తిస్థాయి పదవీకాలం దక్కే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కర్ణాటక రాజకీయ చరిత్రను పరిశీలిస్తే పూర్తి అయిదేళ్ల పదవీకాలాన్ని ముఖ్యమంత్రిగా కొనసాగించడం చాలా అరుదైన విషయంగా కనిపిస్తుంది.
వివరాలు
రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎస్. నిజలింగప్ప
1956 నుంచి ఇప్పటివరకు కేవలం ముగ్గురు నేతలు మాత్రమే ఆ ఘనత సాధించారు. 1973 వరకు ఈ రాష్ట్రం మైసూరు పేరుతో కొనసాగింది. అనంతరం దానికి కర్ణాటకగా పేరు మార్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్. నిజలింగప్ప రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1956లో తొలిసారి బాధ్యతలు స్వీకరించిన ఆయన ఏడాదికిపైగా పదవిలో కొనసాగారు. తర్వాత 1962లో మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1968 వరకు ఐదేళ్లకు పైగా అధికారంలో కొనసాగారు. అనంతరం అదే పార్టీకి చెందిన దేవరాజ్ ఉర్స్ 1972 నుంచి 1977 వరకు పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత సిద్ధరామయ్య 2013 నుంచి 2018 వరకు పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేసిన నాయకుడిగా నిలిచారు.
వివరాలు
2007లో వారం రోజులపాటు మాత్రమే ముఖ్యమంత్రిగా చేసిన యడియూరప్ప
మరోవైపు కర్ణాటకలో చాలా తక్కువ కాలం మాత్రమే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతలూ ఉన్నారు. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడం, ఎన్నికల తర్వాత కుదిరిన కూటములు ఎక్కువకాలం నిలవకపోవడం వల్ల ప్రభుత్వాలు మధ్యలోనే కూలిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. భాజపా నాయకుడు బీఎస్ యడియూరప్ప 2007లో కేవలం వారం రోజులపాటు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగారు. భాజపా-జేడీఎస్ మధ్య ఏర్పడిన విభేదాలతో ప్రభుత్వం కూలిపోయింది. వీరేంద్ర పాటిల్ రాజీనామా అనంతరం 1971లో ఎస్‌ఆర్ కాంతి కొద్దికాలం మాత్రమే ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించారు.
వివరాలు
కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ధరమ్‌సింగ్
అలాగే కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వంలో ధరమ్‌సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏడాదికిపైగా పదవిలో కొనసాగినప్పటికీ కూటమిలోని విభేదాలు పెరగడంతో 2006లో పదవి కోల్పోయారు. ఇక భాజపాలో అంతర్గత రాజకీయాల కారణంగా సదానంద గౌడను తప్పించి 2012లో జగదీశ్ శెట్టర్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. అయితే అసెంబ్లీ గడువు ముగియడంతో ఆయన పదవీకాలం కూడా ఎక్కువకాలం కొనసాగలేదు.