Dharmendra Pradhan: మంత్రి పదవి కంటే పిల్లల భవిష్యత్తే ముఖ్యం : ధర్మేంద్ర ప్రధాన్
ఈ వార్తాకథనం ఏంటి
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై జరిగిన ఆందోళనల్లో 'జెన్ జీ' (Gen Z) యువతను కొందరు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఓ యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. తొలిసారి తన రాజీనామాపై స్పందించారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ''జెన్ జీ మన పిల్లలే. వారి అభివృద్ధి దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉంది. వారితో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. గత పదేళ్లలో దేశంలో 20 కోట్ల మంది పిల్లలు జన్మించారు. భవిష్యత్తులో వారే భారత్‌ను 'విశ్వగురు'గా నిలబెడతారు.
వివరాలు
బీజేడీ ఆందోళనలకు భయపడను
అలాంటి వారి కంటే మంత్రి పదవి నాకు ముఖ్యమైనది కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి నేనే రాజీనామా చేసేందుకు ముందుకొచ్చానని వెల్లడించారు.
తనపై బీజేడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న ఆందోళనలకు తాను భయపడబోనని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.
భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో కొందరు ''ధర్మేంద్ర ప్రధాన్ గో బ్యాక్'' అంటూ నినాదాలు చేశారని గుర్తుచేశారు.
అయినప్పటికీ తాను మళ్లీ ఒడిశాకు వస్తానని చెప్పారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ తనను రాష్ట్ర ప్రజల దృష్టిలో అవమానకరంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
అయితే తాను ఒడిశా ప్రజలకు ఎప్పుడూ తలవంపులు తెచ్చే విధంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు.