
మరోసారి చైనా కవ్వింపు; అరుణాచల్‌లోని 11ప్రదేశాలకు పేరు మార్చిన డ్రాగన్ దేశం
ఈ వార్తాకథనం ఏంటి
'కుక్క తోక వంకర' అన్న చందంగా చైనా వ్యవహరిస్తోంది. మరోసారి డ్రాగన్ దేశం అరుణాచల్ ప్రదేశ్‌లో కవ్వింపు చర్యలకు దిగింది. అరుణాచల్‌లోని 11ప్రదేశాలకు 'దక్షిణ టిబెట్'గా పేరు మార్చి చైనా మరోసారి తన వంకర బుద్ధిని చాటుకుంది.
తద్వారా అరుణాచల్ ప్రదేశ్‌పై తమ హక్కును నొక్కిచెప్పడానికి చైనా ఈ కొత్త నక్క జిత్తుల ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
స్టేట్ కౌన్సిల్, చైనా క్యాబినెట్ జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలను అనుసరించి చైనీస్, టిబెటన్, పిన్యిన్ అక్షరాల్లో 11 ప్రదేశాల పేర్లను చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
చైనా
చైనా చర్యను ఖండించిన భారత్
చైనా 11పేర్లతో విడుదల చేసిన ఈ జాబితాలో రెండు భూభాగాలు, రెండు నివాస ప్రాంతాలు, ఐదు పర్వత శిఖరాలు, రెండు నదులు, వాటి అధీన పరిపాలనా జిల్లాల కోసం ఖచ్చితమైన కో ఆర్డినేట్‌లు ఉన్నాయి.
చైనా ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేయగా, తాజాగా మూడో జాబితాను ప్రకటించింది. 2017లో ఆరు ప్రదేశాలు, 2021లో 15ప్రదేశాలు, ఇప్పుడు 11 ప్రదేశాలు తమవే అని చైనా ప్రకటించినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని స్థలాల పేరు మార్చడానికి చైనా చేసిన చర్యను భారత్ వ్యతిరేకించింది. ఆ రాష్ట్రం ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుందని, సృష్టించిన పేర్లు వాస్తవాన్ని మార్చలేవని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఉద్ఘాటించారు.