Bird Flu Vaccine: పౌల్ట్రీ రంగానికి కేంద్రం గుడ్‌న్యూస్.. దేశీయ బర్డ్ ఫ్లూ టీకా విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో పౌల్ట్రీ పరిశ్రమను బర్డ్ ఫ్లూ ముప్పు నుంచి రక్షించేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హెచ్5ఎన్1 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ టీకాను ఆవిష్కరించారు. భోపాల్‌లోని ఐసీఏఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ సంస్థ ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. అత్యంత ప్రమాదకరమైన ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్ ఫ్లూ)లోని క్లేడ్ 2.3.2.1a రకానికి చెందిన హెచ్5ఎన్1 వైరస్‌ను ఎదుర్కొనేందుకు దేశీయంగా తయారుచేసిన తొలి టీకా ఇదేనని అధికారులు వెల్లడించారు.
వివరాలు
పలు రాష్ట్రాల్లో తీవ్రంగా నష్టపోయిన కోళ్ల పరిశ్రమ
బర్డ్ ఫ్లూగా పిలిచే ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది.
ముఖ్యంగా కోళ్లు, ఇతర పక్షులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఈ వ్యాధి కారణంగా గతంలో పలు రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది.
పౌల్ట్రీ వ్యాపారులు, కోళ్ల పెంపకందారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశీయంగా బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
తాజాగా ఈ టీకా అందుబాటులోకి రావడంతో పౌల్ట్రీ రంగానికి వ్యాధి ముప్పును ఎదుర్కొనేందుకు మరో కీలక సాధనం అందుబాటులోకి వచ్చినట్లయింది.
వివరాలు
కోళ్ల పెంపకందారుల జీవనోపాధికి భరోసా కల్పించడంలో ఈ టీకా కీలక పాత్ర
వ్యాక్సిన్ ఆవిష్కరణ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. దేశంలోని పౌల్ట్రీ పరిశ్రమను కాపాడటంతోపాటు కోళ్ల పెంపకందారుల జీవనోపాధికి భరోసా కల్పించడంలో ఈ టీకా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు, పరిశోధకుల కృషిని ఆయన అభినందించారు.
దేశీయంగా ఇలాంటి టీకా అందుబాటులోకి రావడం పౌల్ట్రీ రంగానికి ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణించారు.