LOADING...
Telangana: ఈ నెల 24,25,26లలో హైదరాబాద్‌ సాహితీ పండగ.. సమకాలీన అంశాలపై చర్చలు,సదస్సులు
సమకాలీన అంశాలపై చర్చలు,సదస్సులు

Telangana: ఈ నెల 24,25,26లలో హైదరాబాద్‌ సాహితీ పండగ.. సమకాలీన అంశాలపై చర్చలు,సదస్సులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2026
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హైదరాబాద్‌ సాహితీ పండగ (హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌)కు నగరం సిద్ధమవుతోంది. గత పదిహేనేళ్లుగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా జరుగుతున్న ఈ సాహిత్య ఉత్సవాలు ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నారు. హైటెక్‌ సిటీలోని సత్వ నాలెడ్జ్‌ సిటీలో మూడు రోజులపాటు సాగే ఈ కార్యక్రమాల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ సాహితీ వేడుకల్లో సాహితీవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, సామాజిక కార్యకర్తలు, సాంస్కృతిక కళాకారులు పాల్గొని తమ ఆలోచనలు పంచుకోనున్నారు. ప్రజలందరికీ ప్రవేశం ఉచితమని, ఎలాంటి రుసుము అవసరం లేదని నిర్వాహకులు తెలిపారు.

వివరాలు 

ప్రారంభించనున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ

సాహిత్యం, వాతావరణ మార్పులు, జన్యువిజ్ఞానం, భాషలు, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, టీకాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, సంస్కృతి వంటి విస్తృత అంశాలపై సదస్సులు, చర్చలు జరగనున్నాయి. చిన్నారులు, కౌమార బాలల కోసం డ్రీమ్‌క్యాచర్స్‌ వంటి ప్రత్యేక కార్యక్రమాలు, యువత కోసం యంగిస్థాన్‌ నుక్కడ్‌, పుస్తక పరిచయాలు, సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సాహితీ పండగను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అధికారికంగా ప్రారంభిస్తారు. అదే రోజు ఉదయం 11 గంటలకు 'కరుణకు ఉన్న శక్తి'అనే అంశంపై నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి,శాంతా సిన్హా పాల్గొనే చర్చ జరుగనుంది. అలాగే'స్వేచ్ఛ-నియంత్రణ-సమాచారం'అనే అంశంపై ధన్యా రాజేంద్రన్‌,పమేలా ఫిలిపోస్‌ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు.

వివరాలు 

'ఇండియా.. భవిష్యత్తు' అంశంపై గోపాలకృష్ణ గాంధీ ప్రసంగం 

రెండో రోజు అయిన 25న 'ఇండియా.. భవిష్యత్తు' అంశంపై గోపాలకృష్ణ గాంధీ ప్రసంగిస్తారు. 'స్వేచ్ఛాయుత ఆర్థికం,రాజకీయం'పై కార్తిక్‌ మురళీధరన్‌, సంజయ్‌బారు చర్చించనున్నారు. '1948 సెప్టెంబరులో హైదరాబాద్‌' అంశంపై అఫ్సర్‌ మహమ్మద్‌,జీనత్‌ఖాన్‌ మాట్లాడతారు. అలాగే 'ఎన్నో రామాయణాలు,ఎన్నో పాఠాలు'పై ఆనంద్‌ నీలకంఠన్‌,'(ఇన్‌)కంప్లీట్‌ జస్టిస్‌? సుప్రీంకోర్టు-75' అంశంపై ఎస్‌.మురళీధర్‌ పాల్గొంటారు. చివరి రోజు అయిన 26న మధ్యాహ్నం 2 గంటలకు 'అభివృద్ధి, పరిపాలన, పేదరికం'పై అభిజిత్‌ బెనర్జీ, కార్తిక్‌ మురళీధరన్‌ ప్రసంగిస్తారు. 'డిజిటల్‌ రూపాలు,సాంకేతిక ప్రకంపనలు' అంశంపై సంతోష్‌ దేశాయ్‌, వందన వాసుదేవన్‌, 'సమకాలీన కశ్మీర్‌ వృత్తాంతం'పై ఈప్సితా చక్రవర్తి, మనీషా సోభ్రాజని మాట్లాడనున్నారు. అనంతరం అజయ్‌గాంధీ స్మారక ఉపన్యాసంలో 'ఆరని జ్యోతి.. స్వతంత్ర భారత్‌' అనే అంశంపై గోపాలకృష్ణ గాంధీ, భక్తియార్‌ దాదాభాయ్‌ ప్రసంగిస్తారు.

Advertisement

వివరాలు 

స్టెమ్‌ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నసంస్థలు ఇవే..

ఈ సాహితీ పండగలో భాగంగా 24న సీసీఎంబీ, 25న ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రి, బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌, 26న ఐఐటీ హైదరాబాద్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, ఆస్ట్రానమీ క్లబ్‌, టీఐఎఫ్‌ఆర్‌ హైదరాబాద్‌ సంస్థలు స్టెమ్‌ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నాయి.

Advertisement