CJP: సీజేపీ నేతల పార్టీ వీడియోలపై దుమారం.. విద్యార్థుల ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్షల అంశంపై నెల రోజులకు పైగా కొనసాగిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలోని విద్యార్థి ఉద్యమం ముగిసిన తర్వాత కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఉద్యమం సమయంలో విద్యార్థులు ఆకలి,అలసట,పోలీసుల చర్యలను ఎదుర్కొంటూ నిరసనలు కొనసాగించగా,ఉద్యమం అనంతరం సీజేపీ కీలక నాయకులు,ప్యానెలిస్టులు ప్రైవేట్ పార్టీల్లో పాల్గొంటూ డాన్సులు చేస్తున్నట్లు కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఈ దీర్ఘకాలిక ఉద్యమంలో విద్యార్థులు ఎండనక,వాననక తిండి,నిద్రను కూడా పక్కనబెట్టి తమ డిమాండ్ల కోసం పోరాటం సాగించారు. చివరికి విద్యార్థుల ప్రధాన డిమాండ్ మేరకు కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆందోళనను ఉపసంహరించుకున్నారు.
వివరాలు
పార్టీలు చేసుకుంటూ డ్యాన్సులు చేసిన సీజేపీ ముఖ్య నేతలు
అయితే ఉద్యమం ముగిసిన కొద్ది రోజులకే సీజేపీకి చెందిన ముఖ్య నాయకులు, ప్యానెలిస్టులు ప్రైవేట్ వేడుకల్లో పాల్గొంటూ మందు సేవిస్తూ, డాన్సులు చేస్తున్నట్లు చూపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందాయి.
ఈ వీడియోలు బయటకు రావడంతో ఉద్యమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యమ సమయంలో సాధారణ విద్యార్థులకు సరైన భోజనం కూడా అందని పరిస్థితులు నెలకొన్నాయని, పలువురు ఆకలితోనే నిరసనలు కొనసాగించాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు.
అలాంటి సమయంలో నాయకత్వం వహించిన వారు ఇప్పుడు పార్టీలు చేసుకుంటూ సంబరాలు జరుపుకోవడం బాధాకరమని విమర్శిస్తున్నారు.
వివరాలు
తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నిరసనకారులు
విద్యార్థుల కష్టాలను, త్యాగాలను కొందరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని కూడా ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కంటే మీడియా దృష్టిని ఆకర్షించడమే వారి అసలు లక్ష్యంగా కనిపిస్తోందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ వీడియోలు వైరల్ కావడంతో సీజేపీ నాయకుల తీరుపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ సాగుతోంది.
ఉద్యమం కోసం అహర్నిశలు శ్రమించిన విద్యార్థులు ఒకవైపు ఇబ్బందులు పడుతుండగా, నాయకులు మరోవైపు వేడుకల్లో పాల్గొనడం ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధమంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.