Loading...
CJP: నేడు మళ్లీ 'చలో సంసద్‌'!.. ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు
నేడు మళ్లీ 'చలో సంసద్‌'!.. ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు

CJP: నేడు మళ్లీ 'చలో సంసద్‌'!.. ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్‌ వైపు చేపట్టిన 'చలో సంసద్‌' మార్చ్‌ దిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయగా.. మంగళవారం కూడా ఆందోళనను కొనసాగిస్తామని కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) ప్రకటించింది. సోమవారం జరిగిన నిరసనల్లో పోలీసులు,ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో మరోసారి పరిస్థితులు అదుపుతప్పకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు నగరంలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సోమవారం రాత్రి జంతర్‌మంతర్‌ వద్ద మాట్లాడిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే, మంగళవారం కూడా పార్లమెంట్‌ వైపు మార్చ్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. "ఈ నిరసన స్థలాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మరోసారి పార్లమెంట్‌ వైపు కదులుతాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే వరకు మా ఉద్యమం ఆగదు" అని వెల్లడించారు.

వివరాలు 

సోమవారం ఉద్రిక్త పరిస్థితులు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తొలి రోజున సీజేపీ ఇచ్చిన 'చలో సంసద్‌' పిలుపుతో వేలాది మంది కార్యకర్తలు జంతర్‌మంతర్‌ నుంచి పార్లమెంట్‌ వైపు ర్యాలీగా బయలుదేరారు.

నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

అయితే భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.

నిరసనకారులు రాళ్లు రువ్వారని, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడంతో పాటు లాఠీచార్జ్‌ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనల్లో పలువురు నిరసనకారులతో పాటు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు.

వివరాలు 

118 మంది పోలీసులకు గాయలు 

సోమవారం జరిగిన ఘర్షణల్లో 118 మంది పోలీసు సిబ్బంది గాయపడినట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

ఆందోళనకారుల దాడుల్లో 20 ప్రభుత్వ వాహనాలు ధ్వంసమైనట్లు వెల్లడించారు.

ఘటనకు సంబంధించిన వీడియోలు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నామని, ఈ హింస వెనుక ఏవైనా కుట్ర కోణాలు ఉన్నాయా అనే అంశంపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, జంతర్‌మంతర్‌ పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

రాత్రి వరకు కూడా అక్కడ భారీ సంఖ్యలో పోలీసులు, నిరసనకారులు మోహరించి ఉండటంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.

ADVERTISEMENT

వివరాలు 

చర్చలకు కేంద్రం ప్రయత్నం

ఘర్షణల మధ్య సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం చర్చలకు ప్రయత్నించింది.

సీజేపీ ప్రతినిధులు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో రెండుసార్లు సమావేశమైనట్లు సమాచారం.

తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా సమర్పించాలని మంత్రి సూచించగా, అనంతరం మూడు ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పార్టీ ప్రతినిధులు అందజేసినట్లు తెలిసింది.

ADVERTISEMENT

వివరాలు 

మంగళవారం మరోసారి మార్చ్

మంగళవారం కూడా పార్లమెంట్‌ వైపు మార్చ్‌ నిర్వహిస్తామని సీజేపీ ప్రకటించడంతో ఢిల్లీ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

నగరంలోని కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించడంతో పాటు బారికేడ్లను కొనసాగిస్తున్నారు.

పార్లమెంట్‌ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న సమయంలో విపక్షాల నిరసనలు, సీజేపీ ఆందోళనలతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

ఈ నేపథ్యంలో మంగళవారం జరగనున్న 'చలో సంసద్‌' మార్చ్‌ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

ADVERTISEMENT