Polavaram: పోలవరం ఎత్తుపై క్లారిటీ.. సందేహాలకు తెర
ఈ వార్తాకథనం ఏంటి
బహుళ ప్రయోజనాలు అందించే పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై నెలకొన్న సందేహాలకు తెరపడింది. ప్రాజెక్టును పూర్తిస్థాయి ఎత్తు 45.72 మీటర్ల వద్దే నిర్మించనున్నట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారికంగా స్పష్టం చేసింది. దీంతో ప్రాజెక్టులో 194.60 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు మార్గం సుగమమైంది. అథారిటీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వివరాలను పొందుపరచడంతో ప్రాజెక్టు భవిష్యత్తుపై స్పష్టత నెలకొంది. ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ప్రాజెక్టును సందర్శించిన తర్వాత ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన పర్యటనకు ముందు ప్రాజెక్టును తొలి దశలో 41.15 మీటర్లకే పరిమితం చేస్తారన్న సమాచారం అథారిటీ వెబ్‌సైట్‌లో ఉండేది. అయితే పర్యటన అనంతరం ఆ వివరాలను సవరించి, గరిష్ఠ నీటిమట్టం అంశాన్ని చేర్చారు.
వివరాలు
వచ్చే ఏడాది జూన్ నాటికి తొలి దశ పనులు పూర్తికి లక్ష్యం
ప్రాజెక్టు రెండో దశకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులు, భూసేకరణ, పునరావాసం వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ హామీతో రెండో దశ పనులపై కేంద్రం ముందడుగు వేస్తోందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ఇక ప్రాజెక్టు తొలిదశ పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని జలవనరుల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే స్పిల్‌వే నిర్మాణం పూర్తవగా, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
వివరాలు
రెండో దశ పనులు ప్రభుత్వానికి పెద్ద సవాలు
ప్రాజెక్టు పూర్తయితే 10.13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు, కృష్ణా పరివాహక ప్రాంతానికి 80 టీఎంసీల నీటి తరలింపు,తాగునీటి సరఫరా, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి వంటి ప్రయోజనాలు లభించనున్నాయి. అయితే రెండో దశ పనులు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనున్నాయి. ఈ దశలో సుమారు 86 వేల నిర్వాసిత కుటుంబాలను తరలించాల్సి ఉండగా, భూసేకరణ, పునరావాసానికి రూ.28,561 కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు.