Climate change: వేడెక్కుతున్న భారత్-పాకిస్థాన్.. గుండెపోటు ముప్పులో 220కోట్ల మంది ప్రజలు.. పరిశోధనలో వెల్లడి
వాతావరణ మార్పులకు సంబంధించిన ఓ పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు ఇప్పటికే తారాస్థాయికి చెరుకున్నాయని, ఈ శతాబ్దం చివరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యయం పేర్కొంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల భారతదేశం, పాకిస్థాన్, సింధు లోయతో సహా ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన కొన్ని ప్రాంతాలకు చెందిన 220కోట్ల మంది గుండెపోటు, హీట్ స్ట్రోక్ ముప్పుపొంచి ఉన్నదని ఈ పరిశోధన అంచనా వేసింది. పెన్సిల్వేనియాకు చెందిన పర్డ్యూ యూనివర్శిటీలోని ఎర్త్, అట్మాస్ఫియరిక్ అండ్ ప్లానెటరీ సైన్సెస్ పరిశోధకులు చేసిన అధ్యయనం 'ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' జర్నల్‌లో ప్రచురితమైంది.
1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రతలు పెరిగితే వినాశనమే..
ప్రపంచ భూ ఊపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే 1.5డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడెక్కడం మానవ ఆరోగ్యానికి వినాశకరమైనదని పరిశోధన వెల్లడించింది. ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయి కంటే 2 డిగ్రీల సెల్సియస్ కంటే పెరిగితే, పాకిస్థాన్, భారతదేశంలోని సింధు నదీ లోయలో 2.2 బిలియన్ల ప్రజలు, తూర్పు చైనాలో 1 బిలియన్ మంది, ఆఫ్రికాలో 800మిలియన్ల మంది ప్రజలు వేడి ముప్పును ఎదుర్కొంటారని ఈ అధ్యయనం సూచిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొనే ప్రధాన నగరాల్లో దిల్లీ, కోల్‌కతా, షాంఘై, ముల్తాన్, నాన్‌జింగ్, వుహాన్ ఉన్నాయి. ఈ ప్రాంతాలు తక్కువ, మధ్య-ఆదాయ దేశాలు అయినందున, ప్రజలు ఉష్ణోగ్రతలను ఎదుర్కోవడానికి ఎయిర్ కండిషనర్లు, ఇతర ఉపశమన మార్గాలను పొందడానికి అవకాశం ఉండకపోవచ్చని అధ్యయనం పేర్కొంది.
అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఉష్ణోగ్రతల పిడుగు
గ్లోబల్ వార్మింగ్ వల్ల మరో 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగితే, తూర్పు సముద్ర తీరం, యునైటెడ్ స్టేట్స్ మధ్య భాగం తీవ్రంగా ప్రభావితం అవుతాయని అధ్యయం చెబుతోంది. దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా కూడా విపరీతమైన వేడిని అనుభవిస్తున్నాయని పరిశోధనలో తేలింది. కానీ అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలు అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే తక్కువ బాధను అనుభవిస్తారు. ఈ ప్రదేశాల్లోని వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు చనిపోయే ప్రమాదం ఉంది. సంపన్న దేశాల కంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా తక్కువ గ్రీన్‌హౌస్, ఉద్గారాలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ అవి ఉష్ణోగ్రతల ముప్పును ఎదుర్కోనున్నట్లు అధ్యయనం వెల్లడించింది. తత్ఫలితంగా, కోట్లాది మంది పేదలు నష్టపోతారు. సంపన్న దేశాలు కూడా ఈ వేడితో బాధపడతాయి.
పారిస్ ఒప్పందానికి తూట్లు
ఉష్ణోగ్రతలు పెరగకుండా నిరోధించడానికి, గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను, ముఖ్యంగా శిలాజ ఇంధనాలను కాల్చడం ద్వారా విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించాలని పరిశోధకులు తెలిపారు. మార్పులు చేయకపోతే మధ్య ఆదాయ, అల్పాదాయ దేశాలు ఎక్కువగా నష్టపోతాయన్నారు. ఉద్గారాల వల్ల ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ప్రతికూలంగా ప్రభావితమవుతారని పరిశోధకులు అంచనా వేశారు. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను నివారించడం కోసం 2015లో వాతావరణ మార్పుపై 196 దేశాలు పారిస్ ఒప్పందంపై సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా పారిశ్రామిక పూర్వ స్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని నిర్ణయించారు. కానీ చాలా దేశాలు ఉద్గారాలను అదుపు చేయలేకపోతున్నాయి. ఫలితంగా పారిస్ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నాయి.