Telangana: రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్న వాతావరణ మార్పులు.. గాలిలో పడిపోయిన తేమ శాతం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో గాలిలో తేమ శాతం ఆందోళనకర స్థాయికి పడిపోతోంది. వారం రోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో తేమ శాతం కనిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా గాలిలో 50నుంచి 60 శాతం వరకు తేమ ఉండాల్సి ఉంటుంది. అలా ఉంటేనే వాతావరణం కొంత చల్లదనంగా ఉంటుంది. అయితే గత ఐదు రోజులుగా తేమ శాతం కేవలం 35 నుంచి 22 శాతం మధ్య మాత్రమే నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. తేమ శాతం భారీగా తగ్గిపోవడం వల్ల ప్రజలు తీవ్ర వేడిని అనుభవిస్తున్నారు. ఉష్ణోగ్రతల్లో కొంత హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ప్రజలకు పెద్దగా ఉపశమనం లభించడం లేదు.
వివరాలు
ఎండ తీవ్రత మరింత అధికం
గాలిలో తేమ లేకపోవడంతో ఎండ తీవ్రత మరింత అధికంగా అనిపిస్తోంది. ఈ పరిస్థితుల కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
వివరాలు
తేమ తగ్గితే కలిగే అనార్థాలు ఇవే
గాలిలో తేమ సమతుల్యం లేకపోతే వేడి తీవ్రత మరింత పెరుగుతుంది. తక్కువ ఉష్ణోగ్రత ఉన్నా అది రెట్టింపు వేడిగా అనిపించే పరిస్థితి ఏర్పడుతుంది. చర్మం త్వరగా పొడిబారుతుంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శ్వాసనాళాలు పొడిబారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మొక్కలు, పూల ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఏసీలు, కూలర్ల వినియోగాన్ని పెంచడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. దీంతో షార్ట్ సర్క్యూట్‌లు జరిగే అవకాశాలు కూడా అధికమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి గాలుల ప్రభావంతో అల్పపీడనం ఏర్పడి సమీప ప్రాంతాల మేఘాలు ఒక్కసారిగా అక్కడికి చేరే అవకాశం ఉంటుంది.
వివరాలు
తేమ తగ్గడానికి కారణాలివే
చెట్ల సంఖ్య తగ్గిపోవడం వల్ల సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. కాంక్రీట్ నిర్మాణాలు పెరగడంతో వేడి తిరిగి పరావర్తనం చెంది వాతావరణం మరింత వేడెక్కుతోంది. పట్టణీకరణ వేగంగా పెరగడం కూడా భూమి త్వరగా వేడెక్కడానికి కారణమవుతోంది. వాహనాల కాలుష్యం పెరగడంతో గాలి ఉష్ణోగ్రత పెరిగి తేమ శాతం తగ్గిపోతోంది.