LOADING...
Telangana:పదో తరగతి పరీక్షలకు క్లోక్‌రూమ్‌లు.. పకడ్బందీ ఏర్పాట్లు
పదో తరగతి పరీక్షలకు క్లోక్‌రూమ్‌లు.. పకడ్బందీ ఏర్పాట్లు

Telangana:పదో తరగతి పరీక్షలకు క్లోక్‌రూమ్‌లు.. పకడ్బందీ ఏర్పాట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2026
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో మొదటిసారి పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో క్లోక్‌రూమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విద్యార్థులు తమతో తీసుకొచ్చే బ్యాగ్‌లను క్లోక్‌రూమ్‌లో జమ చేసి, పరీక్ష పూర్తైన తర్వాత తిరిగి పొందే విధంగా సదుపాయం కల్పించనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు, మార్చి 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో వివాదాలకు గురైన పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఆదేశించారు.

వివరాలు 

పరీక్షల నిర్వహణపై కీలక ఆదేశాలు

ఏ విద్యార్థి అయినా నేలపై కూర్చొని పరీక్ష రాయకుండా తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. పోలీస్‌, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే విద్యాశాఖకు చెందిన వారు కాకుండా ఇతర శాఖల అధికారులతో సిట్టింగ్‌, ఫ్లైయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించేందుకు చీఫ్‌ సూపరింటెండెంట్లకు సెల్‌ఫోన్‌ల అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ పీవీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

వివరాలు 

మార్చి 3 నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

ఇంటర్మీడియట్‌ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొదటి రోజు సంస్కృతం పేపర్ల మూల్యాంకనం చేపడతారు. అనంతరం మిగిలిన సబ్జెక్టుల జవాబుపత్రాలను మూడు దశల్లో పరిశీలించి దిద్దే కార్యక్రమం కొనసాగించనున్నారు.

Advertisement

వివరాలు 

2,676 పరీక్షా కేంద్రాల ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షల కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వీటిలో 1,582 ప్రభుత్వ పాఠశాలలు, 1,094 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ సంవత్సరం పరీక్షలకు 5,17,727 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరవుతుండగా, మరో 10,512 మంది ఒకసారి విఫలమైన అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 11,674 పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొననున్నారు. అందులో 6,386 ప్రభుత్వ విద్యాసంస్థలు, 5,288 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి.

Advertisement