Cough Syrup row: అంతర్జాతీయ ప్రమాణాలు పాటించకపోతే కంపెనీలను మూసేయండి.. దగ్గు మందు మరణాలపై కేంద్రం సీరియస్!
ఈ వార్తాకథనం ఏంటి
'కోల్డ్‌రిఫ్' దగ్గు మందు (Cough Syrup Row) వల్ల పలు రాష్ట్రాల్లో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఔషధ పరిశ్రమలపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా స్పందించింది. సోమవారం దేశంలోని అన్ని ఔషధ తయారీ కంపెనీలకు అల్టిమేటం జారీ చేసింది. జనవరి 1 నాటికి తప్పనిసరిగా అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలను (WHO Standards) అమలు చేయాలని ఆదేశించింది. లేదంటే సంబంధిత కంపెనీల లైసెన్సులు రద్దు చేసి, వాటిని మూసివేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌లో 'కోల్డ్‌రిఫ్' దగ్గు మందు సేవించిన 20 మందికి పైగా చిన్నారులు మరణించారు. ఆ సిరప్‌ను తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాలోని శ్రేసన్ ఫార్మా యూనిట్ తయారు చేసింది.
Details
అత్యంత విషపూరిత రసాయనం ఉన్నట్లు నిర్ధారణ
పరిశీలనలో సిరప్‌లో 48.6శాతం డైఇథైలిన్ గ్లైకాల్ అనే అత్యంత విషపూరిత రసాయనం ఉన్నట్లు తేలింది. దర్యాప్తు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, దగ్గు మందు తయారీ సమయంలో సరైన నాణ్యత నియంత్రణ లేకపోవడం, పర్యవేక్షణలో తీవ్ర లోపాలు ఉండటం వల్ల ఈ విషపూరిత సిరప్ మార్కెట్లోకి చేరింది. ఆ నిర్లక్ష్యమే చిన్నారుల మరణాలకు కారణమైందని విచారణలో తేలింది. అదనంగా, కంపెనీ300కు పైగా ఉల్లంఘనలను చేసినట్లు అధికారుల రిపోర్టుల్లో నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శ్రేసన్ ఫార్మాపై చర్యలు తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం, ఆ సంస్థ తయారీ అనుమతులను రద్దు చేసింది. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన గడువు నేపథ్యంలో ఇతర ఔషధ తయారీ సంస్థలు కూడా అంతర్జాతీయ ప్రమాణాలు పాటించే దిశగా చర్యలు ప్రారంభించాయి.