Manipur: మణిపూర్‌లో పోలీసు అధికారిని కాల్చి చంపిన మిలిటెంట్లు.. ఖండించిన సీఎం బీరేన్ సింగ్
మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. మోరేలో మంగళవారం మిలిటెంట్ల జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి మరణించారు. సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఎస్‌డీపీఓ) చింగ్తామ్ ఆనంద్ మోరేలో కొత్తగా నిర్మించిన హెలిప్యాడ్‌ను పరిశీలిస్తున్న సమయంలో మిలిటెంట్లు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు సిబ్బంది ఆనంద్‌ను హుటాహుటినా మోరేలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాల్పులు జరిపిన మిలిటెంట్లను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టారు.
నేరస్తులను న్యాయస్థానం ముందు నిలబెడతాం: సీఎం
సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఎస్‌డీపీఓ) చింగ్తామ్ ఆనంద్ హత్యపై మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ స్పందించారు. హత్యను ఆయన ఖండించారు. దీన్ని కిరాతకమైన హత్యగా బీరేన్ సింగ్ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజలకు సేవ చేయడంలో ఆనంద్ అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. నేరస్తులను న్యాయస్థానం ముందు నిలబెడతామన్నారు. మణిపూర్ సరిహద్దు పట్టణం మోరే నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని పౌర సంఘాలు డిమాండ్ చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం. మే 3న చురచంద్‌పూర్‌లో ఘర్షణలు చెలరేగిన తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింసాత్మకంగా ఘటనలు జరిగాయి.