Chandrababu Naidu: తిరుమల లడ్డూ కల్తీ కేసు: శాసనసభలో సీఎం సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ పాలనలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ వ్యవహారంలో అధికారులు, నిపుణులు కలిసి వ్యవస్థబద్ధంగా కుట్ర పన్నారు అని ఆయన విమర్శించారు. తిరుమల లడ్డూ అంశంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మాట్లాడుతూ, 'మహాపాపం' శీర్షికతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అప్పటి పాలనలో జరిగిన అనియంత్రిత చర్యలను వివరించారు.
వివరాలు
ఏకసభ్య కమిటీ నియమించిన ప్రభుత్వం
రాజకీయ రంగు పులమకుండా ఉండేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశామని తెలిపారు. సీబీఐ పర్యవేక్షణలో విచారణ జరపాలని సుప్రీంకోర్టు సూచించిందని చెప్పారు. దర్యాప్తు అనంతరం తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక సమర్పించిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఏకసభ్య కమిటీ నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. లడ్డూ వ్యవహారంతో పాటు మరెన్నో అంశాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని అన్నారు. 2019 నుంచి 2024 వరకు సుమారు 59.71 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి వినియోగించారని, దాంతో రూ.231.51 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు. ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించారని, ఇది పద్ధతిగా లాలూచీతో సాగిన దోపిడీ అని స్పష్టం చేశారు.
వివరాలు
రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాల్సిన నిబంధన రద్దు
కల్తీ నెయ్యి అని నిర్ధారణ అయినప్పటికీ సంబంధిత నివేదికలను దాచిపెట్టారని ఆరోపించారు. లడ్డూలో జంతు కొవ్వు ఉన్నట్టు తాను వ్యక్తిగతంగా ఏమీ చెప్పలేదని, ఎన్‌డీడీబీ నివేదిక ఆధారంగానే ఆ విషయాన్ని వెల్లడించానని పేర్కొన్నారు. "దేవుడే నాతో ఆ నిజం చెప్పించాడు" అని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిణామాలు ఈవో, ఛైర్మన్‌లకు తెలియకుండా ఎలా జరిగాయని ప్రశ్నించారు. సంబంధిత వ్యక్తులకు అనుకూలంగా నిబంధనలను సడలించారని ఆరోపించారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాల్సిన నిబంధనను రద్దు చేశారని తెలిపారు. నెయ్యి తయారీలో అవసరమైన అనుభవాన్ని మూడు సంవత్సరాల నుంచి ఒక్క సంవత్సరానికి తగ్గించారని చెప్పారు. రోజుకు 12 టన్నులుగా ఉండాల్సిన వెన్న ఉత్పత్తిని 8 టన్నులకు పరిమితం చేశారని వెల్లడించారు.
వివరాలు
భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ కీలక పాత్ర
డెయిరీల వార్షిక టర్నోవర్ అర్హతను రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించారని వివరించారు. సాంకేతిక పరిశీలనలు, ఫీల్డ్ విజిట్లకు పూర్తిగా మినహాయింపులు ఇచ్చారని అన్నారు. ఆహార భద్రతా నియమాలను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ వ్యవహారంలో పోమిల్ జైన్, విపిన్ జైన్, భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. నెయ్యి సరఫరా చేసిన షెల్ కంపెనీలుగా ఏఆర్ డెయిరీ ఫుడ్స్, శ్రీవైష్ణవి డెయిరీ, మాల్ గంగా మిల్క్ డెయిరీ పేర్లను ప్రస్తావించారు.
వివరాలు
ప్రసాదం నాణ్యత తగ్గిందన్న భక్తులు
భోలే బాబా డెయిరీకి ఈ షెల్ సంస్థలు మద్దతు ఇచ్చాయని తెలిపారు. లంచాల వ్యవహారంలో చిన్నప్పన్న పట్టుబడ్డారని, కల్తీ నెయ్యి సరఫరాదారులకు అతను సహకరించాడని ఆరోపించారు. తప్పుడు రిటర్నులు సమర్పించి అధికారులను మోసం చేశారని, ప్రయోగశాల నివేదికలను కూడా వక్రీకరించారని చెప్పారు. ఇన్ని ఘటనలు జరుగుతుంటే తితిదే బోర్డు ఈవో, ఛైర్మన్‌లకు తెలియకుండా ఎలా జరిగాయని ప్రశ్నించారు. ప్రసాదం స్వీకరించిన భక్తులంతా నాణ్యత తగ్గిందని వ్యాఖ్యానించారని సీఎం తెలిపారు.