Andhra Pradesh: అక్టోబరులో స్థానిక ఎన్నికలు.. యువత, మహిళలకు ప్రాధాన్యం.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగం సిద్ధం కావాలని తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రజలు, కార్యకర్తల ఆమోదం, అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని టికెట్లు కేటాయిస్తామని చెప్పారు. యువత, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. అక్టోబరులో వారం రోజుల వ్యవధిలోనే పట్టణ స్థానిక సంస్థలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
వివరాలు
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ఖాయమని చంద్రబాబు తెలిపారు.
అవసరమైతే 34 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పిస్తామే తప్ప ఒక్క శాతం కూడా తగ్గించబోమని స్పష్టం చేశారు.
1995లో రూపొందించిన చట్టం ప్రకారం 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారని.. ఈ అంశంపై ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తోందని చెప్పారు.
వివరాలు
కూటమిలో సమన్వయం తప్పనిసరి
స్థానిక సంస్థల ఎన్నికలను కూటమి పార్టీలతో కలిసి ఎదుర్కోవాల్సి ఉన్నందున సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామ్య పార్టీల మధ్య గ్యాప్ రాకూడదని స్పష్టం చేశారు.
తెదేపాలోనూ పాత, కొత్త నేతల సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక, ఇతర నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
వివరాలు
అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత మెరుగైన స్ట్రైక్ రేట్ సాధించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మంత్రులు, జోనల్ పరిశీలకులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
టికెట్లు ఆశిస్తున్నవారు ఎవరు? ఆయా ప్రాంతాల్లో సామాజిక, రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? ప్రజల్లో అభ్యర్థులపై అభిప్రాయం ఏమిటి? వంటి అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వాలని సూచించారు.
ప్రతి నియోజకవర్గానికి విజన్ కార్యాలయం
ప్రతి నియోజకవర్గానికి ఒక విజన్ కార్యాలయం ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు.
వాటి పనితీరును ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు.
ఈ నెల 7, 8 తేదీల్లో పార్టీ కార్యాలయంలో లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
వివరాలు
వెలిగొండ, పోలవరం పనులపై అభినందనలు
అడ్డంకులను అధిగమించి వెలిగొండ ఫేజ్-1, పోలవరం ఎడమ కాలువను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబును సమావేశంలో పార్టీ నేతలు అభినందించారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై విస్తృతంగా చర్చించారు.
పాజిటివ్ ఎజెండాతో ఎన్నికలకు వెళ్లాలి
2024 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం పార్టీ ఎక్కడ ఉందో స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా అంచనా వేసుకోవచ్చని చంద్రబాబు అన్నారు.
కూటమిగా స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడం తెదేపాకు ఇదే తొలిసారి కాబట్టి భాగస్వామ్య పార్టీలతో సమన్వయానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.
సానుకూల ఎజెండాతో ఎన్నికలకు సిద్ధమై.. ప్రజల్లో పాజిటివ్ ఓటింగ్ వచ్చేలా పనిచేయాలని సూచించారు.
వివరాలు
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు.
సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని చెప్పారు.
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని.. దాన్ని ఎన్నికల్లో ఓట్లుగా మలచుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
సామాజిక సమీకరణాలకు అనుగుణంగా ఎంపిక
అభ్యర్థుల ఎంపికలో 'సోషల్ రీ-ఇంజినీరింగ్' విధానాన్ని అనుసరించాలని చంద్రబాబు అన్నారు.
అన్ని వర్గాల సామాజిక, రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు.
ప్రజలకు ఆ ఎంపికను స్పష్టంగా వివరించినప్పుడే వారు అర్థం చేసుకుని మద్దతు ఇస్తారని పేర్కొన్నారు.
వివరాలు
'జయహో బీసీ' సభల్లో వివరించాలి
వెనుకబడిన వర్గాలకు గొడ్డలి పార్టీ చేసిన అన్యాయాన్ని 'జయహో బీసీ' సభల ద్వారా ప్రజలకు వివరించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు.
ఎన్నికలను అడ్డుకునే కుట్రలను ఛేదించాలి
సర్ ప్రక్రియ పూర్తికాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదంటూ గొడ్డలి పార్టీ కోర్టును ఆశ్రయించిందని చంద్రబాబు ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదన్నదే ఆ పార్టీ ఉద్దేశమని అన్నారు.
వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రులు, జోనల్ పరిశీలకులు పాల్గొన్నారు.