Loading...
Chandrababu: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

Chandrababu: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 23, 2026
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణం పూర్తిచేసుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఆగస్టు 1న నిర్వహించాలని, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అధికారికంగా ఆహ్వానించారు. బుధవారం ఉదయం పార్లమెంట్ భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో మోదీని కలిసిన చంద్రబాబు ఈ ఆహ్వానాన్ని అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో పీపీపీ విధానంలో హైదరాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసిన సీఎం, ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం ప్రధాని మోదీ హయాంలో రూపుదిద్దుకుని ప్రారంభానికి సిద్ధమైందని వివరించారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, ప్రారంభోత్సవ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని చంద్రబాబుకు హామీ ఇచ్చారు.

వివరాలు

ప్రధానితో వివిధ అంశాలపై చర్చ..

ఉదయం 11 గంటల సమయంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడితో కలిసి ముఖ్యమంత్రి ప్రధాని కార్యాలయానికి చేరుకున్నారు.

తొలుత అందరూ కలిసి ప్రధానితో కొద్దిసేపు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.

అనంతరం చంద్రబాబు, మోదీ ఇద్దరూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

సమావేశం అనంతరం ప్రధానితో జరిగిన భేటీపై తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు ఎక్స్ (X) వేదికగా పోస్టు చేశారు.

వివరాలు

గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై కేంద్రంతో కీలక చర్చలు

గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టు అమలుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా చర్చలు జరిపారు.

ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ గోదావరి నుంచి దాదాపు 2 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతున్న నేపథ్యంలో, ఆ నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు నదుల అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు.

చంద్రబాబు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, ఈ అంశంపై రెండు వారాల్లో భాగస్వామ్య రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ADVERTISEMENT