Loading...
Venkatradri App: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. 'వెంకటాద్రి' యాప్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. 'వెంకటాద్రి' యాప్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Venkatradri App: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. 'వెంకటాద్రి' యాప్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 12, 2026
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది. కొండపైకి వచ్చే యాత్రికులు తమకు అవసరమైన ప్రాంతాలను సులభంగా చేరుకునేలా 'వెంకటాద్రి' పేరుతో కొత్త నావిగేషన్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యూలైన్లు, వసతి గదులు, అన్నప్రసాద కేంద్రాలు తదితర ప్రదేశాలకు వెళ్లేందుకు ఈ యాప్ మార్గనిర్దేశం చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఈ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే.. తిరుమల కొండపై ఇంటర్నెట్ సిగ్నల్ అందుబాటులో లేకపోయినా పనిచేస్తుంది. ఆఫ్‌లైన్, జీపీఎస్ ఆధారంగా భక్తులకు మార్గం చూపిస్తుంది. తెలుగుతో సహా ఐదు భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది.

వివరాలు 

తిరుపతి అభివృద్ధికి రూ.3,222 కోట్ల ప్రాజెక్టులు

ఇందులో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పనిచేసే 'గోవింద' వాయిస్ అసిస్టెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో వైద్య సిబ్బంది లొకేషన్‌ను గుర్తించే సదుపాయం కల్పించారు. ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ల నుంచి భక్తులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వెంకటాద్రి యాప్ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి సమగ్రాభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.

తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా), టీటీడీ సంయుక్తంగా చేపట్టనున్న రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సచివాలయం నుంచి వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన తిరుపతిని ఆదర్శ ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

వివరాలు 

అలిపిరి వద్ద సమీకృత యాత్రికుల టౌన్‌షిప్

భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు నగరంలో మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని తెలిపారు.

ఈ ప్రాజెక్టుల్లో భాగంగా అలిపిరి వద్ద ఎస్వీ జూపార్క్ రహదారిలో భారీ సమీకృత యాత్రికుల టౌన్‌షిప్‌ను నిర్మించనున్నారు.

ఇందుకోసం సుమారు రూ.2,750 కోట్లు వెచ్చించనున్నారు.

తిరుమల కొండపై వసతులపై ఒత్తిడిని తగ్గించి, తిరుపతిలోనే భక్తులకు అవసరమైన సదుపాయాలను ఒకేచోట అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

ADVERTISEMENT

వివరాలు 

అలిపిరి వద్ద సమీకృత యాత్రికుల టౌన్‌షిప్

టౌన్‌షిప్‌లో భాగంగా రూ.1,332 కోట్ల వ్యయంతో పది అంతస్తుల చొప్పున నాలుగు బ్లాకులను నిర్మించనున్నారు.

వీటిలో మొత్తం 2,700 గదులు అందుబాటులోకి రానున్నాయి. ఈ వసతి సముదాయం ద్వారా రోజుకు సుమారు 16 వేల మంది భక్తులకు వసతి కల్పించవచ్చు.

భక్తులకు భోజన సౌకర్యం కల్పించేందుకు రూ.160 కోట్లతో అన్నప్రసాద కేంద్రాన్ని నిర్మించనున్నారు.

ఇందులో ఒకేసారి 6 వేల మంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు.

వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు రూ.311 కోట్లతో బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాన్ని నిర్మిస్తారు.

ఇందులో 4,500 వాహనాలను నిలిపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రూ.90 కోట్లతో సమీకృత రవాణా టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా తొమ్మిది రహదారులు

తిరుపతి నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించడంతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టును చేపట్టింది.

రూ.242 కోట్ల వ్యయంతో 20 కిలోమీటర్ల పొడవున తొమ్మిది మాస్టర్ ప్లాన్ రహదారులను నిర్మించనున్నారు.

ఈ రహదారుల వల్ల జాతీయ రహదారుల మధ్య అనుసంధానం మెరుగుపడుతుంది.

అలాగే తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తులకు ప్రయాణ సౌకర్యం పెరుగుతుంది.

నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ రహదారులు ఉపయోగపడనున్నాయి.

వివరాలు 

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు

శ్రీవారి సేవలో నిరంతరం పనిచేసే టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

ఇందులో భాగంగా 418 ఎకరాల్లో 5,192 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు లేఔట్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

ఈ లేఔట్లలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రూ.230 కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఉద్యోగుల కుటుంబాలు సంతోషంగా ఉంటే వారు మరింత అంకితభావంతో భక్తులకు సేవలందించగలరని చంద్రబాబు పేర్కొన్నారు.

వివరాలు 

తిరుమల తరహా పవిత్రత తిరుపతిలోనూ ఉండాలి

తిరుమలలో ఉన్న పవిత్రత, ఆధ్యాత్మిక వాతావరణం తిరుపతిలోనూ కనిపించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

తిరుపతిని కేవలం యాత్రా కేంద్రంగానే కాకుండా ఆధ్యాత్మికత, పర్యావరణం, సాంకేతికత, విద్య, ఉపాధి, పర్యాటకం వంటి రంగాలను సమన్వయం చేస్తూ అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

నగరంలోని చెరువులను అనుసంధానించి సుందరీకరించాలని సూచించారు.

'వృక్షో గోవింద' కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.

మెరుగైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి, తిరుపతిని వివాహ వేడుకలు, జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు అనువైన కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, తిరుపతి జిల్లా కలెక్టర్, తుడా అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తిరుపతిలో రూ.3,222 కోట్లతో అభివృద్ధి పనులు..  

ADVERTISEMENT