
Chandrababu: రైతుసేవా కేంద్రాల్ని పునర్ వ్యవస్థీకరించండి.. వ్యవసాయశాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు బజార్లను పరస్పర అనుసంధానం చేసి ఒక ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ కార్పొరేషన్ ద్వారా నిధులను సమీకరించి, వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆయన సూచించారు. ఇందుకోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కూడా అధికారులు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 218 మార్కెట్ కమిటీల స్థలాల్లో కోల్డ్ చైన్ సదుపాయాలు, అగ్రి ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
రైతు లాభపడాలి, వినియోగదారుడికి కూడా ప్రయోజనం కలగాలి
గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం వ్యవసాయం,అనుబంధ రంగాల పురోగతిని పరిశీలించారు. ఇందులో ఖరీఫ్ సాగు పరిస్థితులు, రబీ ప్రణాళిక, ధాన్యం కొనుగోలు చర్యలు, వ్యవసాయ రంగంలో గ్రాస్ వాల్యూ యాడిషన్, అలాగే అక్టోబర్ 11న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోయే 'పీఎం ధన ధాన్య కృషి యోజన' వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. "రైతు లాభపడాలి, వినియోగదారుడికి కూడా ప్రయోజనం కలగాలి. ఇందుకోసం వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పని చేయాలి. రైతు బజార్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి," అని చంద్రబాబు అధికారులు సూచించారు.
వివరాలు
రబీ సీజన్‌కు 23 లక్షల టన్నుల యూరియా అందుబాటులో
రాబోయే రబీ సీజన్ కోసం రాష్ట్రంలో 23 లక్షల టన్నుల యూరియా నిల్వలో ఉందని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, భూసార పరీక్షల ఆధారంగా ప్రతి ఎకరాకు అవసరమైన ఎరువుల మోతాదును రైతులకు స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. "యూరియా పంపిణీపై రికార్డులు పూర్తిగా సక్రమంగా ఉండాలి. ఆధార్ ఆధారంగా ఎరువులు పంపిణీ చేయాలి," అని ఆయన సూచించారు. అదే సమయంలో, ఈ ఏడాది రాష్ట్రంలో మొత్తం 90.91 లక్షల టన్నుల పంట ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని, అందులో 51 లక్షల టన్నుల సేకరణను లక్ష్యంగా పెట్టుకోవాలి అని సీఎం పేర్కొన్నారు.
వివరాలు
నాలుగు జిల్లాల్లో పొగాకు క్రాప్ హాలిడే
సమీక్ష సందర్భంగా చంద్రబాబు, "హెచ్‌డీ బర్లీ పొగాకుకు సరైన మార్కెట్ లభించేలా చర్యలు తీసుకోండి. నాలుగు జిల్లాల్లో పొగాకు పంటకు క్రాప్ హాలిడే ప్రకటించండి," అని ఆదేశించారు. అదేవిధంగా, "పప్పు దినుసులను శాతానికి శాతం కొనుగోలు చేస్తామని కేంద్రం చెబుతోంది. దీని అమలుపై సమగ్ర అధ్యయనం చేయండి. గతంలో ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే కర్ణాటకలో సిరికల్చర్ (పట్టు సాగు) తక్కువ స్థాయిలో ఉండేది, కానీ ఇప్పుడు అక్కడ మన రాష్ట్రంతో పోలిస్తే ఎనిమిది రెట్లు పెరిగింది. దీని వెనుక ఉన్న కారణాలను విశ్లేషించండి. సిరికల్చర్ అభివృద్ధికి బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం పొందండి," అని చంద్రబాబు సూచించారు.
వివరాలు
ఉద్యాన పంటలపై దృష్టి
"అరటి పంటకు దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. ఉద్యాన పంటల ఎగుమతుల్లో ఎలాంటి సవాళ్లు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. అలాగే ఉల్లి, టమాటా, మిర్చి వంటి ప్రధాన పంటల ధరలు పడిపోకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి," అని ఆయన పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, అలాగే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.