
Chandrababu Naidu: జూలై 10న శ్రీ సత్యసాయి జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్ మీటింగ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 10వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు గ్రామాన్ని సందర్శించనున్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అక్కడ నిర్వహించనున్న మెగా పేరెంట్స్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని కొత్తచెరువు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ చేతన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి సమావేశాలు ఎక్కడ జరగాలి, ఎలా నిర్వహించాలి అనే అంశాలపై కలెక్టర్ సూచనలు ఇచ్చారు. పర్యటనను సజావుగా, విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.
వివరాలు
మెగా పేరెంట్స్ మీటింగ్ అంటే ఏమిటి?
కలెక్టర్ పలు ప్రాంతాలను స్వయంగా సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప, మండల విద్యాశాఖ అధికారి జయచంద్ర తదితరులు హాజరయ్యారు. మెగా పేరెంట్స్ మీటింగ్ (మెగా PTM) అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించబడుతున్న ఓ విశిష్ట కార్యక్రమం. దీనిద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల మధ్య బలమైన సంబంధాలు ఏర్పడి, విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలన్నదే ప్రధాన లక్ష్యం.
వివరాలు
ఈ కార్యక్రమం ద్వారా…
ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిపై తల్లిదండ్రులకు వివరాలు తెలియజేస్తారు. విద్యార్థి బాగా చదువుతున్న విషయాలు, వెనుకబడుతున్న సబ్జెక్టులు ఏవో స్పష్టంగా చర్చిస్తారు. తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పరస్పరంగా అభిప్రాయాలు, సలహాలు పంచుకోవడానికి ఇది ఓ వేదికగా ఉంటుంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు చేపడతారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, దాతలు, SMC సభ్యుల సహకారం తీసుకుంటారు. మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థులకు ఇచ్చే కిట్లు, తరగతుల నిర్వహణ, హాజరు రేట్లు, విద్యా పథకాల అమలుపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించబడుతుంది.