CM Chandrababu: 100% సేవలు ఆన్‌లైన్‌లో.. డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి ప్రభుత్వ శాఖలో సేవలు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా అందించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. "ప్రజలు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్, వాట్సాప్, యాప్‌ల ద్వారా అన్ని ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావాలి. ఇప్పటికే డిజిటల్ సౌకర్యాలు ఉన్నప్పటికీ ఇంకా కార్యాలయాల్లోకే రావాలని చెప్పడం తగదు. ఎక్కడైనా అలాంటి పరిస్థితి ఉండకూడదు" అని అన్నారు. గురువారం సచివాలయంలో 'డేటా ఆధారిత పాలన'పై నిర్వహించిన సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, నియోజకవర్గ టాస్క్‌ఫోర్స్ అధికారులు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.
వివరాలు
సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే నేర్చుకోవాలి
"డేటా ఆధారిత పాలనను అమలు చేయడం మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతుల బాధ్యత. నిర్ణయించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవ్వాలి. ఇది శుక్రవారం నుంచే అమల్లోకి వస్తుంది. సందేహాలుంటే ఆర్టీజీఎస్‌ని సంప్రదించండి. కానీ ఆర్టీజీఎస్ పని డేటా సమీకరించడం మాత్రమే. అమలు బాధ్యత మాత్రం శాఖలదే. ఫలితాలు చూపాలి" అని చెప్పారు. "ఇక నుంచి పూర్తిగా డేటా ఆధారిత పరిపాలన జరుగుతుంది. డిసెంబర్ రెండో వారంలో కలెక్టర్ సమావేశంలో ఈ అంశం మరోసారి పరిశీలిస్తాం.అప్పటికి మీ కార్యాచరణ స్పష్టంగా కనిపించాలి. తెలియకపోతే నేర్చుకోవాలి. కార్యాలయాల్లో కూర్చోవడం మాత్రమే సరిపోదు,క్షేత్రస్థాయిలో పరిస్థితులు స్వయంగా చూడాలి" అని సూచించారు.
వివరాలు
కాన్సెప్ట్‌ను పూర్తిగా అర్థం చేసుకోవాలి
"డేటా అనేది వనరు. సక్రమంగా ఉపయోగిస్తే గొప్ప ఫలితాలు వస్తాయి. వసతిగృహాల్లో తాగునీరు బాగాలేక డయేరియా ప్రబలింది. ఇది రియల్‌టైమ్ పర్యవేక్షణలో ఎందుకు పట్టించుకోలేదు?" అని ప్రశ్నించారు. "డేటాలేక్, డేటా లెన్స్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వినియోగంపై జీఏడీ నుంచి మార్గదర్శకాలు ఇవ్వాలి. కొన్ని శాఖలు ఇంకా తమ ప్రోగ్రామ్‌లను డేటాలేక్‌తో అనుసంధానం చేయాలి. మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు ఈ భావనను పూర్తిగా గ్రహించి, తమ శాఖల్లో ఉపయోగించాలో ఆలోచించాలి. 13 పాత జిల్లాల్లో ఆర్టీజీ కార్యాలయాల నిర్మాణం డిసెంబర్ 15 నాటికి పూర్తవుతుంది. అక్కడినుంచి 26 జిల్లాల సేవలను సమన్వయం చేస్తాం. ప్రతిశాఖ ఏఐ ఆధారిత వినియోగ నమూనాలను రూపొందించాలి" అని చెప్పారు.
వివరాలు
ఒక్కరు తప్పు చేసినా.. ప్రభుత్వానికే చెడ్డపేరు
"ఒకరు తప్పు చేసినా ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తోంది. ఎక్సైజ్ శాఖలో గత ఐదేళ్ల్లో జరిగిన అవకతవకలను సవరించి పారదర్శకత తీసుకొచ్చాం. అయినప్పటికీ కొందరు వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. పారదర్శకంగా పనిచేయడం మాత్రమే కాదు, ప్రజలకు అది అర్థమయ్యేలా చెప్పాలి. తప్పులు ఉంటే సవరించాలి" అన్నారు. అంతా డేటా ఆధారితమే "ఆర్టీజీఎస్ ద్వారా డేటాను విశ్లేషిస్తున్నాం. శాఖల పనితీరు డేటా ఆధారంగానే బయటపడుతోంది. ప్రభుత్వ పరిపాలనం కూడా డేటాసెంటర్‌లు, ఎనలిటిక్స్ ఆధారంగానే ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని మనం కూడా సరిగ్గా ఉపయోగించుకోవాలి" అని వివరించారు.
వివరాలు
మీకోసం అర్జీల పరిష్కారంపై శ్రద్ధ లేదు
"కొన్ని శాఖలు 'మీకోసం' అర్జీల పరిశీలనలో నిర్లక్ష్యం చూపుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో 4,174 అర్జీలలో కేవలం 1,450 మాత్రమే సక్రమంగా పరిష్కరించారు. 1,099 అర్జీలు తప్పుగా పరిష్కరించగా, 1,600 పైగా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ శాఖలో సంతృప్తి శాతం 62 నుంచి 70కి పెరిగినా అవినీతి ఇంకా ఉంది. విద్యుత్, మున్సిపల్ శాఖల్లో సేవా నాణ్యత మరింత మెరుగుపరచాలి" అని చెప్పారు.
వివరాలు
సమిష్టిగా పనిచేయాలి
"శాఖలన్నీ వేర్వేరైనా, చివరికి ప్రజలకు ఒకే ప్రభుత్వమే కనిపిస్తుంది. కాబట్టి బృందంగా కలిసి పనిచేయాలి. మొంథా తుఫాను సమయంలో సాంకేతికతను ఉపయోగించి సమర్థంగా సేవలు అందించాం. అదే విధానం కొనసాగాలి" అన్నారు. "సిస్టం లోపాలు, గత ప్రభుత్వ వైఫల్యాల ప్రభావం ఇంకా ఉన్నప్పటికీ, ఇప్పుడు క్రమంగా సంస్కరణలు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా అన్నీ మారవు. గ్రామస్థాయి వరకు అందరూ ఒకే దిశగా పనిచేయాలి" అని సూచించారు.
వివరాలు
ప్రమాదాలు జరిగినప్పుడే స్పందిస్తే ఎలా?
"ఘటన జరిగిన తర్వాత స్పందించడం కాదు, ముందే అంచనా వేసి నియంత్రించగల విధానాలు ఉండాలి. బయట రాష్ట్రాల్లో తక్కువ రుసుముతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వాటిపై ఆయా రాష్ట్రాల పర్యవేక్షణ లేదు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉంది' అని చంద్రబాబు సూచించారు శ్రీకాకుళంలో తొక్కిసలాటు, విశాఖలో బాణసంచా ప్రమాదాలు.. వ్యవస్థలు ముందే చర్యలు తీసుకోవాల్సింది. టెక్నాలజీ ఉపయోగిస్తే ఈ సమస్యలను ముందుగానే నివారించవచ్చు" అని అన్నారు.