chandrababu: జీఎస్‌డీపీ వృద్ధిలో దూసుకెళ్తున్న ఏపీ: సీఎం చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధి రేటు ఆశాజనకంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) ఆంధ్రప్రదేశ్ జీఎస్‌డీపీ వృద్ధి 11.28 శాతంగా నమోదు కాగా, దేశవ్యాప్తంగా వృద్ధిరేటు కేవలం 8.7 శాతమేనని చెప్పారు. 'స్వర్ణాంధ్ర విజన్-2047'కు అనుగుణంగా ఈ మొత్తం ఆర్థిక సంవత్సరంలో 17.11 శాతం వృద్ధిని సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. రంగాల వారీగా ప్రత్యేక వ్యూహాలు అమలు చేసి ఈ గమ్యాన్ని చేరుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జీఎస్‌డీపీ పెరుగుదల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని,తలసరి ఆదాయం పెరగడంతో కొనుగోలు శక్తి మరింత బలపడుతుందని వివరించారు.
వివరాలు
అధిక వృద్ధి దిశగా చేపట్టిన చర్యలు
సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమగ్ర పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో గణాంకాలతో పాటు వృద్ధి లక్ష్యాల వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి కోసం స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నాం. ఆక్వా రంగానికి యూనిట్‌కు రూ.1.50 చొప్పున సబ్సిడీతో విద్యుత్ అందిస్తున్నాం. పంటలకు మద్దతుగా ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు భరోసా కల్పిస్తున్నాం. రహదారులు, పోర్టులు, జలవనరులు వంటి ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులను గణనీయంగా పెంచి, ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తెచ్చాం.
వివరాలు
ఆమోదించిన పెట్టుబడులతో 7.62 లక్షల మందికి ఉద్యోగాలు
పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తూ పరిశ్రమలను ఆకర్షిస్తున్నాం. రాష్ట్రానికి మొత్తం రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముండగా, వాటి ద్వారా దాదాపు 16 లక్షల మందికి ఉపాధి కలగనుంది. ఇప్పటికే ఆమోదించిన పెట్టుబడులతో 8.29 లక్షల కోట్లతో 7.62 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయి. మెగా పీటీఎం సహా పలు కార్యక్రమాలతో విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
వివరాలు
పారిశ్రామిక రంగానికి ఊపు
పరిశ్రమల రంగంలో మొత్తం జీవీఏ రూ.86,456 కోట్లకు చేరి, గత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంతో పోలిస్తే 12.20 శాతం వృద్ధిని నమోదు చేసింది. మైనింగ్, క్వారీయింగ్ రంగాల్లో వృద్ధి 18.43 శాతానికి చేరింది. రోడ్ మెటల్ ఉత్పత్తి 79.51 శాతం బ్లాక్ గ్రానైట్ ఉత్పత్తి 47.62 శాతం మేర పెరిగాయి. విద్యుత్తు ఉత్పత్తి 19.12 శాతం పెరిగి 26,837 మిలియన్ యూనిట్లకు చేరింది. విద్యుత్తు వినియోగం కూడా 4.17 శాతం వృద్ధిని సాధించింది.
వివరాలు
పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లోని ప్రధానాంశాలు..
2025-26 రెండో త్రైమాసిక అంచనాల ప్రకారం పరిశ్రమల రంగం అత్యంత అనూహ్య ప్రగతిని సాధించింది. వృద్ధిరేటు 2.78 శాతం నుంచి నేరుగా 12.20శాతానికి పెరిగింది. వ్యవసాయ రంగంలో వృద్ధి 10.70 శాతం కాగా, సేవారంగంలో 11.30శాతం నమోదు అయింది. వ్యవసాయ ఉత్పత్తుల్లో భారీ పెరుగుదల అరటి ఉత్పత్తి 151 శాతం వృద్ధి చెంది, 14.85 లక్షల టన్నుల నుంచి 37.31లక్షల టన్నులకు చేరింది. జామ దిగుబడిలో 87 శాతం బత్తాయిలో 7.20 శాతం వృద్ధి వచ్చింది. ధాన్యం ఉత్పత్తి 24 శాతం పెరిగి గత ఏడాది 2.93లక్షల టన్నుల నుంచి ఈ ఏడాది 3.64 లక్షల టన్నులకు చేరింది. పత్తి ఉత్పత్తి 31 శాతం పెరిగి 0.30 లక్షల టన్నులుగా నమోదైంది.
వివరాలు
సేవారంగం దూకుడు
మత్స్యరంగంలో రొయ్యల ఉత్పత్తి 27 శాతం పెరిగి 5.47 లక్షల టన్నుల నుంచి 6.95 లక్షల టన్నులకు చేరింది. పశుసంవర్థక శాఖలో మాంస ఉత్పత్తి 8 శాతం, గుడ్ల ఉత్పత్తి 6.7 శాతం మేర పెరిగాయి. హోటల్స్, రెస్టారెంట్ల విభాగంలో జీవీఏ రూ.25,292 కోట్లుగా నమోదైంది. కార్గో హ్యాండ్లింగ్ రంగం 14.90 శాతం వృద్ధి సాధించింది. విమానయానంలో 9.42 శాతం వృద్ధి చోటుచేసుకుంది. ప్రయాణికుల సంఖ్య 13.69 లక్షల నుంచి 14.98 లక్షల వరకు పెరిగింది. వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్‌లో 4.37 శాతం వృద్ధి నమోదైంది.
వివరాలు
తొలి అర్ధ సంవత్సరంలో 10.91% వృద్ధి
2025-26 ఆర్థిక సంవత్సరపు తొలి అర్ధ భాగంలో రాష్ట్ర జీఎస్‌డీపీ అంచనా వృద్ధి 10.91 శాతంగా ఉంది. మొత్తం జీవీఏ విలువ రూ.7,58,270 కోట్లుగా నమోదైందని సీఎం తెలిపారు. జాతీయ సగటు కేవలం 8.8 శాతం మాత్రమే ఉండటం గమనార్హమన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించుకున్న 17.11 శాతం మొత్తం వృద్ధి లక్ష్యంలో ఇప్పటివరకు 40.64 శాతం లక్ష్యాన్ని తొలి అర్ధ సంవత్సరంలోనే చేరుకున్నామని పేర్కొన్నారు. మిగిలిన 59.36 శాతం వృద్ధిని రెండో అర్ధ సంవత్సరంలో సాధించాల్సి ఉందన్నారు.
వివరాలు
రంగాల వారీ జీవీఏ లక్ష్య సాధన ఇలా..
వ్యవసాయ, అనుబంధ రంగాలు - 65.64 శాతం పరిశ్రమల రంగం - 55 శాతం సేవారంగం - 55 శాతం లక్ష్యాలను రెండో అర్ధ సంవత్సరంలో సాధించాల్సి ఉంది. రంగాల వారీ వ్యూహాలు వ్యవసాయం: పంచసూత్రాల అమలు, నాణ్యమైన విత్తనాలు-ఎరువుల సరఫరా, సమర్థ నీటి పంపిణీ, పంట కొనుగోళ్లు, యాంత్రీకరణ విస్తరణ, డెయిరీ, మత్స్య, కోళ్ల పరిశ్రమ, పట్టు పరిశ్రమ, ఉద్యాన పంటల ప్రోత్సాహం. పారిశ్రామిక రంగం: ఎంఎస్‌ఎంఈ ఉత్పత్తుల్లో నాణ్యత పెంపు, సీఐఐ భాగస్వామ్య సదస్సుల్లో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు, వేగంగా అనుమతుల జారీ, మౌలిక వసతుల విస్తరణ. సేవారంగం: పర్యాటకం, పోర్టు,మారిటైమ్ సేవల విస్తరణ,ప్రాంతీయ-అంతర్జాతీయ కనెక్టివిటీ పెంపు, ఐటీ, ఆర్థిక సేవలు, విద్య, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం.
వివరాలు
వైకాపా పాలన కాలంలో క్షీణత
2018-19లో రాష్ట్ర వృద్ధిరేటు 11.14 శాతంగా ఉండగా, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2019-20లో అది 5.97 శాతానికి పడిపోయిందని చంద్రబాబు గుర్తు చేశారు. అదే సమయంలో తలసరి ఆదాయం వృద్ధిరేటు కూడా 17 శాతం నుంచి 10.23 శాతానికి తగ్గిపోయిందని వివరించారు.