Cm chandrababu: ఆరు ఉత్తమ విధానాల ఎంపిక.. రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎం ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
పరిపాలనలో కొత్తదనానికి క్షేత్రస్థాయి నుంచే ఆరంభం కావాలని, ఇందుకు జిల్లా కలెక్టర్లే ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈసారి నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం భిన్నమైన విధానాన్ని అమలు చేశారు. జిల్లాల వారీగా అమలవుతున్న వినూత్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, వాటిలో అత్యుత్తమమైన ఆరు కార్యక్రమాలను ఎంపిక చేశారు. గురువారం జరిగిన సదస్సులో ఆ ఆరు కార్యక్రమాలను ఆయా జిల్లాల కలెక్టర్లే స్వయంగా వివరించారు. ఈ కార్యక్రమాలు పరిపాలనలో "గేమ్ ఛేంజర్‌లు"గా మారతాయని సీఎం ప్రశంసించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ ఉత్తమ విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించి, తమ జిల్లాల్లోనూ అమలు చేయాలని ఆదేశించారు.
వివరాలు
దేశమంతా మన నుంచే నేర్చుకుంటుంది: చంద్రబాబు
నాణ్యమైన కార్యక్రమాలను రూపొందించిన కలెక్టర్లు రాష్ట్రవ్యాప్తంగా వాటి అమలుకు మార్గనిర్దేశం చేసే ఛాంపియన్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి ఇలాంటి ఉత్తమ విధానాల సంఖ్యను పది వరకు పెంచాలన్నారు. ఈ వినూత్న చర్యల ద్వారా రాష్ట్రం ఒక ఆదర్శంగా నిలుస్తుందని,ఇతర రాష్ట్రాల అధికారులు ఇక్కడికి వచ్చి నేర్చుకునే పరిస్థితి ఏర్పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. రిజిస్ట్రేషన్ల శాఖలో వచ్చిన మార్పును ఉదహరిస్తూ, మంగళగిరిలో పవన్ అనే వ్యక్తికి కేవలం 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవగా, అతడికి వచ్చిన సందేశాన్ని సీఎంవోకు పంపిన ఘటనను సీఎం సభలో చదివి వినిపించారు. ఇలాంటి పనితీరు ఉంటే దేశమంతా మన నుంచే నేర్చుకుంటుందన్నారు.
వివరాలు
1 మెరికల్లా గిరిజన పిల్లలు
ప్రాజెక్టు: నిర్మాణ్ జిల్లా: అల్లూరి సీతారామరాజు కలెక్టర్: దినేశ్‌కుమార్ లక్ష్యం: గిరిజన ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే బలమైన విద్యా పునాది వేసి, మెరుగైన గ్రేడ్లు సాధించేలా చేయడం. ప్రతిభావంతులను 'సూపర్-50'గా ఎంపిక చేసి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం. 'మార్గదర్శిని' పేరుతో కెరీర్ గైడెన్స్ అందించడం. అమలు విధానం: ఆశ్రమ పాఠశాలల్లో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) కార్యక్రమాన్ని అమలు చేశారు. తెలుగు, ఇంగ్లిష్, గణితంలో మే నెలలో పరీక్షలు నిర్వహించి, ఫలితాల ఆధారంగా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పదో తరగతి విద్యార్థులకు జిల్లాస్థాయిలో పరీక్ష నిర్వహించి, సూపర్-50గా ఎంపికైన 50 మందికి ప్రత్యేక కోచింగ్ అందించారు.
వివరాలు
1 మెరికల్లా గిరిజన పిల్లలు
ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన విద్యార్థుల్లో ఒకరు ఈ ఏడాది పదో తరగతిలో 577 మార్కులు సాధించి రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారు. 2023-24, 2024-25 సంవత్సరాల్లో సూపర్-50లో శిక్షణ పొందిన విద్యార్థులంతా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. సీఎం సూచన: కుప్పం నియోజకవర్గంలో అమలవుతున్న 'విలువల బడి' కార్యక్రమంలో రోజూ గంటన్నర పాటు పిల్లలకు స్ఫూర్తిదాయక అంశాలు బోధిస్తున్నారని, ఈ విధానాన్ని కూడా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు.
వివరాలు
2 ఆరోగ్యానికి మేలి మలుపు
ప్రాజెక్టు: ముస్తాబు జిల్లా: పార్వతీపురం మన్యం కలెక్టర్: ప్రభాకర్‌రెడ్డి లక్ష్యం: విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను పెంపొందించడం, వ్యాధుల నుంచి రక్షణ కల్పించడం. మంచి అలవాట్లు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ అలవర్చడం. అమలు విధానం: ప్రతి తరగతి గదిలో 'ముస్తాబు కార్నర్' ఏర్పాటు చేశారు. ఇందులో అద్దం, దువ్వెన, తువాలు, సబ్బు, నెయిల్ కట్టర్, హ్యాండ్ వాష్, బకెట్ తదితరాలను ఉంచారు. ఇంటి వద్ద సరిగ్గా తయారై రాని విద్యార్థులను ముందుగా ముస్తాబు కార్నర్‌కు పంపించి ముఖం కడుక్కొని, తల దువ్వుకున్న తరువాతే తరగతి గదిలోకి అనుమతిస్తున్నారు.
వివరాలు
2 ఆరోగ్యానికి మేలి మలుపు
సీఎం సూచన: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలో 'ముస్తాబు' కార్యక్రమాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 79 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిపి సుమారు రెండు కోట్ల మందిపై ఈ కార్యక్రమం ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
వివరాలు
3 సారా తయారీ నుంచి 'మార్పు' వైపు
ప్రాజెక్టు: మార్పు జిల్లా: ఏలూరు కలెక్టర్: వెట్రి సెల్వి లక్ష్యం: నాటు సారా తయారీపై ఆధారపడుతున్న కుటుంబాలను ఆ వృత్తి నుంచి తప్పించి, ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడం. గౌరవప్రదమైన జీవితం అందించడం. అమలు విధానం: గత పదేళ్లుగా సారా తయారీలో ఉండి కేసులు ఎదుర్కొంటున్న226కుటుంబాలను గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో 40 కుటుంబాలు ముందుకు రావడంతో వారికి రూ.31.40 లక్షల రుణాలు అందించారు. వీరు పశుపోషణ, మాంసం దుకాణాలు, కుండల తయారీ వంటి ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసి నెలకు రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. సీఎం సూచన: మాదకద్రవ్యాలకు బానిసైన వారికి కూడా ఉపాధి అవకాశాలు చూపిస్తే వారు వ్యసనాల నుంచి బయటపడతారని సీఎం పేర్కొన్నారు.
వివరాలు
4 ప్రాజెక్టు: ఛాంపియన్ ఫార్మర్స్
ప్రాజెక్టు: ఛాంపియన్ ఫార్మర్స్ జిల్లా: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు కలెక్టర్: హిమాంశు శుక్లా లక్ష్యం: అందుబాటులో ఉన్న నీటి వనరులతో సాగు విస్తీర్ణాన్ని పెంచడం. వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం. ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడం. అమలు విధానం: జిల్లాలోని 727 పంచాయతీల నుంచి ఒక్కో ఛాంపియన్ రైతును ఎంపిక చేశారు. మధ్య ప్రాంతంలో మొక్కజొన్న, పశ్చిమ ప్రాంతంలో వేరుశనగ, నిమ్మ, డెల్టా ప్రాంతంలో వరికి బదులు సీవీడ్, ఆక్వా, అరటి సాగును, పొలాల గట్లపై ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించారు. యాంత్రీకరణ కోసం 45 రకాల పరికరాలను రాయితీపై అందిస్తున్నారు.
వివరాలు
4 ప్రాజెక్టు: ఛాంపియన్ ఫార్మర్స్
సీఎం సూచన: రైతులు ఒకేసారి మూడు, నాలుగు రకాల పంటలు వేస్తారని, వాటిని వేర్వేరు శాఖలు పర్యవేక్షించడంతో సమన్వయం లోపిస్తోందని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా జిల్లా కేంద్రంగా వ్యవసాయ పరికరాల బ్యాంక్ ఏర్పాటు చేసి, రైతులు వినియోగించేలా చూడాలని సూచించారు.
వివరాలు
5 ఆహారం.. శుచిగా, శుభ్రంగా, రుచిగా
పథకం: మధ్యాహ్న భోజనానికి ఆధునిక వంటశాలలు జిల్లా: వైఎస్సార్ కడప కలెక్టర్: చెరుకూరి శ్రీధర్ లక్ష్యం: మధ్యాహ్న భోజన పథకంలో శుచి,శుభ్రత,నాణ్యతను పెంచడం. పిల్లలకు పోషకాహారం అందించడం. పర్యావరణహిత వంటశాలలు ఏర్పాటు చేయడం. అమలు విధానం: ప్రతి మండలానికి ఒక ఆధునిక వంటశాల ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్, బయోగ్యాస్ ద్వారా అక్కడే వంట చేసి పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. వంటవారికి పోషకాహార నిపుణుల ద్వారా శిక్షణ ఇచ్చారు. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల నుంచే ముడిసరకులు కొనుగోలు చేస్తున్నారు. గతంలో రేషన్ బియ్యం సరఫరాకు ఉపయోగించిన వాహనాలను భోజన సరఫరాకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రోజూ 136 పాఠశాలల్లోని 10 వేల మందికి భోజనం అందుతోంది. మరో 33 వంటశాలలు నిర్మాణంలో ఉన్నాయి.
వివరాలు
5 ఆహారం.. శుచిగా, శుభ్రంగా, రుచిగా
జనవరి 26 నాటికి జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ వంటశాలల నుంచే భోజనం సరఫరా చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించి వంటశాలల నిర్మాణానికి రూ.2.5కోట్లు మంజూరు చేసింది. ఒక్కో వంటశాల నిర్మాణానికి రూ.62లక్షలు ఖర్చవుతోంది. సీఎం సూచన: వంటలో అన్య పదార్థాలు కలవకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడుతున్న ఏఐ ఆధారిత సాంకేతికతను పరిశీలించాలని సూచించారు. పిల్లలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించి,అవసరమైన సప్లిమెంట్లు ఆహారం ద్వారానే అందించాలని,రక్తహీనతను నివారించాలని ఆదేశించారు. రాష్ట్రమంతా వంటశాలలు: ఈ స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు నచ్చిందని,కేంద్రం సహకరిస్తుందని విద్యాశాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. కలెక్టర్లు క్లస్టర్ల వారీగా స్థలాలు గుర్తిస్తే రాష్ట్రవ్యాప్తంగా వంటశాలలు నిర్మించవచ్చని సూచించారు.
వివరాలు
6 డిజిటల్ రూపంలో రెవెన్యూ రికార్డులు
ప్రాజెక్టు: రెవెన్యూ శాఖలో ఏఐ వినియోగం - డిజిటలీకరణ జిల్లా: అనంతపురం కలెక్టర్: ఒ. ఆనంద్ లక్ష్యం: 10(1), 1బి, ఆర్‌హెచ్ కాపీ, సీలింగ్, డీకేటీ, వివాద రిజిస్టర్లు, కోర్టు కేసుల రికార్డులు తదితరాలను డిజిటలీకరించి, ఒకే వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవడం. అమలు విధానం: మాన్యువల్‌గా ఉన్న అన్ని రికార్డులను కేవలం రూ.3 లక్షల వ్యయంతో స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో భద్రపరిచారు. సర్వే నంబరు నమోదు చేస్తే సంబంధిత డిజిటల్ కాపీలు వెంటనే అందుబాటులోకి వస్తున్నాయి. ఫేజ్-2లో రెవెన్యూ ఆఫీస్ టూల్‌ను రూపొందిస్తున్నారు. అధికారులు ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే వెబ్‌ల్యాండ్‌లో సమాచారం ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది.
వివరాలు
6 డిజిటల్ రూపంలో రెవెన్యూ రికార్డులు
సీఎం సూచన: ఈ విధానం ద్వారా రెవెన్యూ రికార్డుల్లో పూర్తి పారదర్శకత వస్తుందని, ఎలాంటి ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా భద్రంగా ఉపయోగపడుతుందని సీఎం స్పష్టం చేశారు.