Chandrababu: క్వాంటం పరిశోధనలకు నోబెల్ సాధిస్తే రూ.100 కోట్ల ప్రోత్సాహకం: చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
క్వాంటం వ్యాలీకి వేదికగా మారనున్న గ్రీన్‌ఫీల్డ్ రాజధాని అమరావతిని, ప్రపంచంలోనే ప్రముఖ ఐదు క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర క్వాంటం విజన్‌ను అధికారికంగా ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులను వర్చువల్ మాధ్యమంలో ఉద్దేశించి నిర్వహించిన 'క్వాంటమ్ టాక్' కార్యక్రమంలో ఆయన ఈ అంశంపై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే తరాల కోసం ఆధునిక నైపుణ్యాలను పెంపొందించడం, పెద్ద ఎత్తున అధిక విలువ కలిగిన ఉద్యోగాలను సృష్టించడం,ఉత్పత్తి కేంద్రిత దృక్పథాన్ని అమలు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అన్ని రకాల క్వాంటం కంప్యూటర్ల అభివృద్ధి, వాటి తయారీలో అవసరమైన సంపూర్ణ సరఫరా గొలుసును రాష్ట్రంలోనే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
వివరాలు
భవిష్యత్తులో ప్రతి రంగంలోనూ క్వాంటం కంప్యూటింగ్
భవిష్యత్తులో ప్రతి రంగంలోనూ క్వాంటం కంప్యూటింగ్ కీలక పాత్ర పోషించబోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. 'ఆంధ్రప్రదేశ్ విజన్: అమరావతిలో క్వాంటం వ్యాలీ. ఆంధ్రప్రదేశ్ ఫాలో కాదు, మేం నాయకత్వం వహిస్తాం. అమరావతిలో క్వాంటం కంప్యూటర్ల తయారీకి అవసరమైన ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. సుమారు 80 నుంచి 85 శాతం వరకు భాగస్వామ్య కాంపోనెంట్ల సరఫరాదారులు ముందుకు వచ్చారు' అని చంద్రబాబు తెలిపారు. రెండేళ్లలోపు అమరావతిలో క్వాంటం కంప్యూటర్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని, జ్ఞాన ఆధారిత సంస్థలు లేదా ఆధునిక సాంకేతిక రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారు అమరావతిని కేంద్రంగా చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
వివరాలు
భారతదేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం
అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన పరిశోధనల ద్వారా క్వాంటం కంప్యూటింగ్ రంగంలో నోబెల్ బహుమతి సాధించిన శాస్త్రవేత్తకు రూ.100 కోట్ల ప్రోత్సాహకాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆవిష్కరణలు, ఉత్పత్తి ఆధారిత భవిష్యత్తుపై యువత ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. చైనా 1971లో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని, భారతదేశంలో ఆ ప్రక్రియ 1991లో ప్రారంభమైందని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ తరువాత దేశం వెనక్కి తిరిగి చూడలేదన్నారు. సామాన్య ప్రజల సాధికారతే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక సంస్కరణలను అమలు చేస్తోందని చెప్పారు. విశాఖపట్నం ఇప్పటికే అనేక ఐటీ సంస్థలకు నిలయంగా మారిందని, భవిష్యత్తులో అది నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీ రంగాలకు ముఖ్య కేంద్రంగా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు.
వివరాలు
అమరావతిలో క్వాంటం వ్యాలీ ద్వారా బలమైన ఎకోసిస్టమ్
'రాబోయే 20 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ దిశగా తీసుకెళ్లాలన్న దానిపై ఇప్పుడే కార్యాచరణ రూపొందిస్తున్నాం. అమరావతిలో క్వాంటం వ్యాలీ ద్వారా బలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం. భారత్‌లో ప్రతిభ ఉన్నప్పటికీ, క్వాంటం రంగంలో పెట్టుబడుల పరిధి ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా ఈ రంగంలో భారీ పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఐటీ విప్లవంలాగానే, ప్రపంచవ్యాప్తంగా రానున్న క్వాంటం విప్లవాన్ని భారతీయులు ముందుండి స్వీకరించాలి' అని చంద్రబాబు పేర్కొన్నారు.