Cm chandrababu: సమష్టి కృషితో తుపాను నష్టాన్ని తగ్గించాం.. మంత్రులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
తుపాను ప్రభావాన్ని తగ్గించడంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒక బృందంలా సమిష్టిగా పనిచేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయం నుంచి గ్రామస్థాయివరకు అందరూ ఏకతాటిపై కృషి చేయడంతో పెద్ద నష్టాన్ని నివారించగలిగామని ఆయన అభిప్రాయపడ్డారు. మరో రెండు రోజుల పాటు ఇదే తీరులో పనిచేస్తే బాధిత ప్రజలకు మరింత ఉపశమనం లభిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కష్టసమయంలో బాధితుల కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు.
వివరాలు
ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజలకు వివరించాలి.
బుధవారం ఉదయం మంత్రి వర్గ సభ్యులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. "గత నాలుగు ఐదు రోజులుగా సమర్థంగా స్పందించి నష్టనివారణ చర్యలు చేపట్టాం. ఇప్పుడు తుపాను తగ్గింది కాబట్టి, సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. బాధితులకు అవసరమైన నిత్యావసర వస్తువులను తక్షణమే అందించాలి. వారిని అన్ని విధాలా ఆదుకోవాలి. మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజలకు వివరించాలి. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉన్నా తెలుసుకొని పరిష్కరించాలి," అని చంద్రబాబు ఆదేశించారు. తుపాను కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు.
వివరాలు
కొత్త మైక్ ఎనౌన్స్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు
కలెక్టర్లు,అధికారులు కంట్రోల్ రూమ్‌లలో ఉండి రియల్‌టైమ్ సమాచారం సేకరించి తగిన చర్యలు తీసుకున్నారు. సచివాలయాల వద్ద మైక్ ఎనౌన్స్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఆ సమాచారం కింది స్థాయి వరకు నిరంతరం చేరేలా చేశాం. ఇది ఒక కొత్త విధానంగా చాలా ఫలితాన్నిచ్చింది," అని చంద్రబాబు వివరించారు. ఎస్డీఆర్‌ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సమర్థంగా పనిచేశారని ఆయన ప్రశంసించారు. చెట్లు కూలినా, విద్యుత్తు తీగలు తెగినా వాటిని యుద్ధప్రాతిపదికన తొలగించారని అన్నారు.
వివరాలు
కొత్త మైక్ ఎనౌన్స్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు
అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో డ్రెయిన్లు శుభ్రపరిచే చర్యలు తీసుకోవడంతో కాలనీలు ముంపు నుంచి రక్షించబడ్డాయని పేర్కొన్నారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు పది వేల మంది సిబ్బందిని నియమించి పని చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం వెంట నిలబడితేనే వారి నమ్మకం బలపడుతుందని, ఈ చర్యల ద్వారా ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం మరింతగా పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.