CM Chandrababu: రాజధానిపై దుష్ప్రచారం చేస్తున్నా వెనక్కి తగ్గం : సీఎం చంద్రబాబు హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
చెడ్డ వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజానికి తీవ్ర హాని జరుగుతుందని, స్వచ్ఛమైన ఆలోచనలు ఉన్నప్పుడే భవిష్యత్ బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వ్యర్థాల సేకరణ కోసం ఉద్దేశించిన స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. అనంతరం ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ, నగరిలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఏడాది క్రితం ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా ప్రారంభించామని, స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, ప్రజల జీవన విధానంగా మారాలని స్పష్టం చేశారు.
Details
రూ.6.7 కోట్లతో 200 ఈ-ఆటోలు, 12,000 ట్రైసైకిళ్లు
అందుకే ప్రతి నెలా మూడో శనివారం తాను సహా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0లో భాగంగా సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కోసం రూ.510 కోట్ల వ్యయంతో 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు సీఎం వెల్లడించారు. అలాగే హౌస్‌హోల్డ్ వేస్ట్ ప్రాసెసింగ్ కోసం రూ.2.21 కోట్ల విలువైన 9,048 హోం కంపోస్టింగ్ బిన్స్‌ను మెప్మా ఆర్పీలకు అందజేశామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ చెత్త సేకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ 2.0 కింద రూ.6.7 కోట్లతో 200 ఈ-ఆటోలు, 12,000 ట్రైసైకిళ్లు, 5,000 పుష్‌కార్టులను సిద్ధం చేశామని వివరించారు.
Details
రాజకీయ అంశాలపై ప్రస్తావన
గతేడాది నుంచి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పరిశుభ్రతా డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో కర్నూలు, రాజమండ్రి, కడప, నెల్లూరులో నాలుగు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను పీపీపీ మోడల్‌లో ప్రారంభించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. రెండేళ్లలో ఈ ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభిస్తాయని తెలిపారు. విజయవాడ, తిరుపతిలో కూడా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ప్రతిపాదనలు ఉన్నాయని, అవి కార్యరూపం దాల్చితే డంపింగ్ యార్డ్ సమస్య పూర్తిగా తొలగిపోతుందని, కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందని అన్నారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలపై కూడా సీఎం చంద్రబాబు స్పందించారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అతలాకుతలమైందని విమర్శించారు. ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారని, తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.
Details
అమరావతిపై మూడు ముక్కలాట ఆడారు
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లామని, 94 శాతం స్ట్రైక్ రేటుతో ఘన విజయం సాధించామని తెలిపారు. గత పాలనలో అమరావతిపై మూడు ముక్కలాట ఆడారని, స్మశానం, ఎడారి అంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇప్పటికీ ప్రెస్‌మీట్లు పెట్టి క్రెడిట్ చోరీ చేశామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, రాజధానిపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి ఆగదని స్పష్టం చేశారు. ఆనాడు సైబరాబాద్‌ను నిర్మించానని, నేడు అమరావతి నగరాన్ని నిర్మించే అవకాశం ప్రజలు తనకు ఇచ్చారని చెప్పారు. ఇరిగేషన్ రంగంపై కూడా చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం నీటిపారుదల వ్యవస్థను సర్వనాశనం చేసిందని, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు.
Details
కేంద్ర పథకాలను నిర్వీర్యం చేశారు
సీమను రాళ్ల సీమగా మార్చారని ఆరోపించారు. కేంద్ర నిధులను పక్కదారి పట్టించి, కేంద్ర పథకాలను నిర్వీర్యం చేశారని అన్నారు. జల్ జీవన్ మిషన్‌లో రూ.లక్ష కోట్ల వరకు వినియోగించుకునే అవకాశం ఉన్నా అసమర్థతతో వదిలేశారని విమర్శించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన వారిని ఏమి చేయాలంటూ ప్రశ్నించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్‌ను గోదావరిలో కలిపేశారని ఆరోపించారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని, గోదావరి జలాలు సీమకు వస్తే నీటి సమస్య పూర్తిగా తీరిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.