CM Jagan: మిచౌంగ్ తుపాను తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష.. సహాయక చర్యలకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లో మిచౌంగ్ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. హుద్‌హుద్ లాంటి భారీ తుపాన్లను ఎదుర్కొన్న అనుభవం ఉన్న నేపథ్యంలో కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు. బాపట్ల సమీపంలో తుపాను మంగళవారం సాయంత్రం తీరందాటే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోందని జగన్ అన్నారు. డిసెంబర్ 7వ తేదీ నాటికి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు కుదుటపడే అవకాశం ఉన్నట్లు అధికారులకు జగన్ వివరించారు.
ప్రతి జిల్లాకు రూ.2 కోట్లను విడుదల
తుపాను నేపథ్యంలో అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్లను విడుదలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు జగన్ వెల్లడించారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నామని పేర్కొన్నారు. వీరు జిల్లా యంత్రాంగంతో సహాయక చర్యలను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. తుపాను వల్ల ప్రాణనష్టం లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా కోతకు వచ్చిన పంటను కాపాడుకోవాలన్నారు. తోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జగన్ స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 308 శిబిరాల ఏర్పాటుకు గుర్తించామన్నారు. అవసరమైన చోట శిబిరాల్లోకి ప్రజలను వెంటనే తరలించాలన్నారు. వర్షాల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు రూ.10వేల సాయం అందించాలన్నారు.