Page Loader
తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి నియామకం
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారిని నియమించిన సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి నియామకం

వ్రాసిన వారు Stalin
Jan 11, 2023
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి తెలంగాణ మొట్టమొదటి మహిళా సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎస్‌గా తనకు అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌ను శాంతి కుమారి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎస్‌గా పని‌చేస్తున్న సోమేష్‌కుమార్‌ క్యాడర్ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. సోమేష్‌కుమార్‌ ఏపీ క్యాడర్‌‌కి వెళ్లాలని ఆదేశాలు‌ ఇచ్చింది. ఈ‌ సందర్భంగా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో తెలంగాణకు కొత్త సీఎస్ ఎంపిక అనివార్యమైంది.

శాంతకుమారి

ప్రస్తుతం అటవీ శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా..

సీనియర్ ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, శాంత కుమారిలో ఒకరు సీఎస్‌గా నియామకం అయ్యే అవకాశం ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురిలో రామకృష్ణారావు ఎంపికకే కేసీఆర్ మొగ్గు చూపుతారని అందరూ మొదటి నుంచి ఊహించారు. కానీ అనూహ్యంగా సీఎస్‌గా శాంతా కుమారికి సీఎస్‌గా అవకాశం కల్పించారు. శాంతా కుమారి.. తన సుదీర్ఘ ఐఏఎస్ కెరీర్‌లో పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య, స్కిల్ డెవలప్‌మెంట్, అటవీశాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆమెకు ఉంది. శాంత కుమారి ప్రస్తుతం అటవీ శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు.