Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో ఇవాళ సీఎం రేవంత్ కీలక భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ అక్కడే అత్యవసర భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో రాష్ట్ర ఉన్నతాధికారులు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీతో పాటు కీలక శాఖల కార్యదర్శులు పాల్గొననున్నారు. వారిలో కొందరు ప్రత్యక్షంగా హాజరవుతుండగా, మిగిలిన వారు జూమ్ ద్వారా పాల్గొనే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు తుగ్లక్ రోడ్‌లోని తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించనున్నారు.
కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే అవకాశం
వాటికి తోడు ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ చట్టంలో పొందుపరిచిన ఏపీ విభజన హామీల అమలు, కేంద్ర నిధుల మంజూరు, పెండింగ్ అంశాలపై శాఖల వారీగా అప్‌డేట్లు ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు. సీఎం రేవంత్ దిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలను కలవనున్నారు. వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీని కలసి ఆమెను అభినందించే అవకాశం ఉంది. ఈ కీలక చర్చల అనంతరం సీఎం రేవంత్ తిరిగి హైదరాబాద్‌కి రానున్నారు.