#NewsBytesExplainer: కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన.. పథకాల అమలులో నిర్లక్ష్యం.. శాఖలపై పట్టులేని మంత్రులు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి రెగ్యులర్‌గా రారని,ఇంటి నుంచో లేదా పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచో శాఖలపై సమీక్షలు నిర్వహిస్తారని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. సమీక్షలు జరగనప్పుడు, ఆయన జిల్లా పర్యటనలు, లేదంటే ఢిల్లీ వెళ్తారు. మంత్రులు సచివాలయ సమావేశాల సమయంలో మాత్రమే ఆయనను కలుస్తారని, అయితే ఇతర సందర్భాల్లో వారి శాఖలు, నియోజకవర్గాల పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నారని సమాచారం. రాష్ట్ర సచివాలయానికి పెద్ద దిక్కు ముఖ్యమంత్రే.. ఆయనే నిత్యం సచివాలయానికి డుమ్మా కొడుతుంటే.. కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు బాధ్యతగా ఉంటారని భావించడం భ్రమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికీ చాలా మంది ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు మంత్రులను ఖాతర్ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.
వివరాలు
తోక జాడిస్తున్న,కింది స్థాయి అధికారులు
ప్రజా సమస్యలపై వచ్చే ఎమ్మెల్యేలను ఏమాత్రం పట్టించుకోవడం లేదనే వాదన ఉంది. సచివాలయ వర్గాల ప్రకారం, కొంతమంది ఐఏఎస్ అధికారులు తామే సుప్రీంగా భావించి, సందర్శకుల వద్ద నుండి దరఖాస్తులను స్వీకరించకుండా సమావేశాలంటూ వెళ్లిపోతున్నారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. వీరి వ్యవహారం ఈ విధంగా ఉంటే,కింది స్థాయి అధికారులు కూడా తోక జాడిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల వినతులు, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించడంలో తీవ్ర జాప్యం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే సచివాలయానికి రావడం లేదు..మేమెందుకు పనిచేయాలి?అనే విధంగా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో సచివాలయంలో పని చేస్తున్న అధికార యంత్రాంగం ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నామని అనుకుంటున్నారనే సెటైర్లు వినబడుతున్నాయి.
వివరాలు
కార్యదర్శులు స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు
గతంలో,ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో ఉంటే కనీసం రెండు మూడు గంటల సమయం సచివాలయంలో గడిపేవారు. సమీక్షలు నిర్వహించి,సందర్శకులకు అప్పాయింట్‌మెంట్ ఇచ్చేవారు. తద్వారా సచివాలయంలోని అధికారులు,సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయిందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి సచివాలయానికి రెగ్యులర్‌గా రావడం,సమీక్షలు నిర్వహించడం,ప్రజా ప్రతినిధులు, సందర్శకులను కలవడం వల్లనే ముఖ్య కార్యదర్శులు,ఇతర కార్యదర్శులు వాస్తవంగా పని చేస్తున్నారా లేదా అనేది స్పష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో,కార్యదర్శులు స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా,సందర్శకుల సమయం మూడు నుంచి ఐదు గంటల మధ్య మాత్రమే ఉన్నందున,ఆ సమయంలో ఆచాల మంది కార్యదర్శులు సమీక్షలు లేదా ప్రధాన కార్యదర్శి సమీక్షలకు హాజరు పేరుతో తప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
పరిష్కారం నోచుకోని సమస్యలెన్నో..
రెండు సంవత్సరాలుగా, అధికారుల నుంచి నివేదికలు సక్రమంగా రాకపోవడం, నెలవారీగా ఫైల్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు, ఎందుకు తిరస్కరించారన్న సమాచారం అందడం లేదు. గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు పెండింగ్ బకాయిల కోసం ఆందోళనలు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయనీ, ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలన్నది స్పష్టంగా లేదని అధికారులు పేర్కొంటున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేషీలో పైరవీలు చేసుకునే వారికే డబ్బులు చెల్లిస్తున్నారన్న ఆరోపణలు బలంగా.. బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
వివరాలు
భూ భారతి పోర్టల్‌లో దరఖాస్తులకు సమాధానం రావడం లేదు
భూ సమస్యల ఫైళ్ళు కూడా పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉన్నాయి.మండల,ఆర్డీఓ,జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాల్లో ఫైల్స్ మూలుగుతున్నాయి. భూ భారతి పోర్టల్‌లో దరఖాస్తులకు సమాధానం రావడం లేదు.అవినీతి కారణంగా ప్రభుత్వ ప్రతిష్టకు హాని జరుగుతోంది. తహశీల్దార్ వారం రోజులు, ఆర్డీఓ మూడు రోజులు, అదనపు కలెక్టర్ 3 రోజులు, జిల్లా కలెక్టర్ వారం రోజుల్లో ఫైళ్లను పరిష్కరించాలని గడువు ఉన్నా అమలు కావడం లేదని ఆయన చెప్పారు.
వివరాలు
ఏ శాఖలో ఏం జరుగుతోందో..
రైతు యూరియా కొరత, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు,రోడ్ల గుంతల వల్ల వాహనదారులు ఎదుర్కొనే సమస్యలు, రవాణా శాఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సేవల లోపాలు తదితర సమస్యలు ఇంకా పరిష్కారమవ్వడం లేదు. ఏ శాఖలో ఏం జరుగుతోందో, ముఖ్యమంత్రికి గానీ, మంత్రులకు గానీ స్పష్టత లేని పరిస్థితి నెలకొంది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం, సీస్టమాటిక్‌గా, సూక్ష్మ స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తే, ముఖ్య కార్యదర్శులు, ఇతర కార్యదర్శుల పనితీరు బట్టబయలు అవుతుందని ఒక అధికారి వ్యాఖ్యానించారు.