Vijay: 'లైబ్రరీ' వివాదంలో సీఎం విజయ్.. పుస్తకాల కొనుగోళ్లలో భారీ అవకతవకలు!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం మరో వివాదాన్ని ఎదుర్కొంటోంది. గత నెల భారీ హంగులతో ప్రారంభించిన 'పెరియార్ అరివులగం' (Periyar Arivulagam) లైబ్రరీలో పుస్తకాల కొనుగోళ్లకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పుస్తకాల ధరలు, రచయితల పేర్లు, ప్రచురణకర్తల వివరాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేత అన్నామలైతో పాటు పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ వివాదానికి కారణమేంటి..?
వివరాలు
రూ.300 కోట్లతో ఏడు అంతస్తుల లైబ్రరీ నిర్మాణం
తమిళనాడులోని కోయంబత్తూరులో ఏడు ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల వ్యయంతో ఏడు అంతస్తుల భారీ లైబ్రరీని నిర్మించారు.
డీఎంకే ప్రభుత్వ హయాంలో ఈ నిర్మాణ పనులు ప్రారంభమవగా.. ఇటీవల పూర్తయ్యాయి. అక్టోబర్ 16న ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) ఘనంగా ఈ లైబ్రరీని ప్రారంభించారు.
ద్రవిడ రాజకీయాల రూపకర్త పెరియార్ జ్ఞాపకార్థం దీనికి 'పెరియార్ అరివులగం' అని పేరు పెట్టారు.
ఈ గ్రంథాలయంలో లక్షకు పైగా పుస్తకాలతో పాటు డిజిటల్ లైబ్రరీ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు.
వివరాలు
పుస్తకాల కొనుగోళ్లపై రచయిత పెరుమాళ్ మురుగన్ ఆరోపణలు
ఈ లైబ్రరీలో పుస్తకాల కొనుగోళ్లకు సంబంధించి ప్రముఖ రచయిత పెరుమాళ్ మురుగన్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
స్థానిక తమిళ మీడియా కథనాల ప్రకారం.. సుమారు 1,800 పుస్తకాలను అధిక ధరలకు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు.
ఆయా పుస్తకాలపై ఉన్న రచయితలు, ప్రచురణకర్తల పేర్లు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని పుస్తకాలను కృత్రిమ మేధ(AI)సాయంతో రాసి ఉండొచ్చని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
వాటిపై ముద్రించిన ఐఎస్బీఎన్(ISBN- International Standard Book Number) నంబర్లపైనా అభ్యంతరాలు తెలిపారు. నిర్దిష్ట పుస్తక శీర్షికను గుర్తించేందుకు కేటాయించే ఈ నంబర్ల విషయంలోనూ తప్పులు ఉన్నాయని ఆరోపించారు.
అంతేకాకుండా ఆయా పుస్తకాల ప్రచురణకర్తలను సంప్రదించేందుకు అవసరమైన వివరాలు కూడా అందుబాటులో లేవని వెల్లడించారు.
వివరాలు
పుస్తకాల ధరలపైనా అనుమానాలు.. టీవీకే, డీఎంకే మధ్య విమర్శలు
బాలు, జ్యోతి శరవణన్, జ్యోతి హరిహరన్, త్రిష విజయ్, రాణి పన్నీర్ వంటి పేర్లు రచయితలుగా ఉండటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ పేర్లు తనకు ఎప్పుడూ వినిపించలేదని పేర్కొన్నారు. లైబ్రరీలోని పుస్తకాల కొనుగోళ్లపై మరిన్ని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఎవరికీ పెద్దగా పరిచయం లేని ప్రచురణ సంస్థల పేర్లు పుస్తకాలపై ఉన్నాయని పెరుమాళ్ మురుగన్ పేర్కొన్నారు.
సాధారణంగా రూ.250 నుంచి రూ.300 వరకు ఉండాల్సిన కొన్ని పుస్తకాల ధరలను ఏకంగా రూ.1,500 వరకు నిర్ణయించారని ఆరోపించారు.
అంతేకాకుండా 'తమిళనాడు ఒరు పార్వై' అనే పుస్తకంలో తమిళనాడు తొలి ముఖ్యమంత్రి పేరు ముత్తువేలు సుబ్బయ్య అయ్యర్ అని పేర్కొనడంపైనా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వివరాలు
అనేక సందేహాలు
ఈ పరిణామాలు పుస్తకాల ఎంపిక, కొనుగోలు ప్రక్రియపై అనేక సందేహాలకు దారితీశాయి. ఈ వ్యవహారంపై అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య విమర్శలు మొదలయ్యాయి.
పుస్తకాల కొనుగోళ్ల ప్రక్రియ గత డీఎంకే ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందని విజయ్ ప్రభుత్వం చెబుతోంది. అయితే కొత్త ప్రభుత్వమే పుస్తకాలను కొనుగోలు చేసిందని డీఎంకే ఆరోపిస్తోంది.
దీంతో కొనుగోళ్ల బాధ్యత ఎవరిపై ఉందనే అంశం రాజకీయంగా చర్చకు దారితీసింది.
ఈ పుస్తకాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు నిజమైతే భవిష్యత్ తరాలకు ద్రోహం చేసినట్లేనని బీజేపీ నేత అన్నామలై ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాలు
స్వతంత్ర దర్యాప్తునకు అన్నామలై డిమాండ్
ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసిన పుస్తకాల జాబితా ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఆ జాబితాలోని పుస్తకాలనే కొనుగోలు చేశారా? వాటి వివరాలను ఎవరు పరిశీలించి ధ్రువీకరించారు? అనే అంశాలపై స్పష్టత రావాలని అన్నారు.
పుస్తకాల ఎంపిక నుంచి కొనుగోలు వరకు జరిగిన ప్రతి ప్రక్రియను పరిశీలించాలని, మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని కోరారు.
మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణలో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా పుస్తకాల కొనుగోళ్లలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.