Page Loader
Yogi Adityanath: సంగం నీరు తాగేందుకు అనుకూలంగా ఉన్నాయి: యోగి ఆదిత్యనాథ్‌
సంగం నీరు తాగేందుకు అనుకూలంగా ఉన్నాయి: యోగి ఆదిత్యనాథ్‌

Yogi Adityanath: సంగం నీరు తాగేందుకు అనుకూలంగా ఉన్నాయి: యోగి ఆదిత్యనాథ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2025
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద మహాకుంభమేళా జరుగుతున్ననేపథ్యంలో,భక్తులు గత నెల నుంచే పవిత్ర స్నానాలు చేస్తోన్న విషయం విదితమే. అయితే,తాజాగా వెలువడిన ఓ నివేదిక పెనుమార్పులకు కారణమైంది.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం,నదీ నీటిలో ఫీకల్ బ్యాక్టీరియా అధికంగా ఉండటంతో,స్నానం చేయడానికి నీరు అనుకూలంగా లేదని పేర్కొన్నారు. ఈ నివేదికపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. సంగమంలోని నీరు తాగడానికి కూడా అనుకూలంగా ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను కూడా ఖండించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ,"గంగామాత,సనాతన ధర్మం,భారత దేశంపై తప్పుడు ప్రచారం చేస్తే, 56 కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని తక్కువ చేసి చూసినట్లే" అని అన్నారు.

వివరాలు 

56.25 కోట్ల మంది భక్తులు  పుణ్యస్నానం ఆచరించారు

పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నివేదిక ఆధారంగా జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (NGT) కూడా స్పందించింది. మహాకుంభ మేళాలో పలు ప్రాంతాల్లో నీటిలో బ్యాక్టీరియా అధికంగా ఉందని పేర్కొంది. ప్రయాగ్‌రాజ్‌లో నదిలో స్నానం చేసే భక్తుల సంఖ్య పెరిగిన కారణంగా నీటి నాణ్యత ప్రభావితమై ఉండొచ్చని అంచనా వేసింది. అయితే, ఈ ఆరోపణలను కొట్టిపారుస్తూ యోగి ఆదిత్యనాథ్ "సంగమంలోని నీరు తాగేందుకు కూడా అనుకూలంగా ఉంది" అని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ గణాంకాల ప్రకారం 56.25 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు.

వివరాలు 

మమతా బెనర్జీ విమర్శలు

కాగా, ఇటీవల మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, దిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే భక్తుల భారీ రద్దీ కారణంగా మరో 18 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన యోగి, "ఆధ్యాత్మిక కార్యక్రమంపై రాజకీయాలు చేయడం ఎంతవరకు సముచితం? మహాకుంభ ప్రారంభమైనప్పటి నుంచి కొంత మంది వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ శతాబ్దంలో జరిగే గొప్ప మేళాలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు" అని వ్యాఖ్యానించారు.

వివరాలు 

భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం

ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద జనవరి 13న మహాకుంభ మేళా ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీ వరకు ఈ పవిత్ర ఆధ్యాత్మిక ఉత్సవాన్ని నిర్వహించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభ అంచనాల ప్రకారం 45 కోట్ల మంది భక్తులు హాజరవుతారని భావించినా, ఇప్పటివరకు 56 కోట్ల మంది భక్తులు కుంభస్నానం ఆచరించారు. మరో 7 రోజులు మిగిలి ఉండటంతో, భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.